
వసుంధర
తనకి స్టేజ్ ఫియర్. ఇంటా బయటా సైలెంటే! పెళ్లయ్యాక మారిపోయింది... ఇప్పుడు యూట్యూబులో చిట్కాలు, షాపింగ్ సలహాలతో లక్షల మందిని ఆకర్షిస్తోంది. మోడలింగ్ కూడా చేసేస్తోంది. మొదట్లో అనుకున్న ఫలితాలు రాకపోయినా, నెగెటివ్ కామెంట్లతో ఒత్తిడి ఎదుర్కొన్నా.. తన ప్రయాణాన్ని ఆపలేదామె. ఆ పట్టుదల, ఆత్మవిశ్వాసాలే తనను కోట్ల మందికి చేరువ చేశాయి. ఇదంతా ఎలా సాధ్యమైందో అలేఖ్య కీర్తి వసుంధరతో పంచుకుంది!
నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే నాటికి దాన్ని గురించి కనీస అవగాహన కూడా లేదంటే నమ్ముతారా? ఇప్పుడు నా యూట్యూబ్ ఖాతాను 3 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు. ఏడుకోట్ల మందికిపైగా చూశారు. ఇన్‌స్టాలో లక్షకుపైగా ఫాలోయర్లున్నారు. వెయ్యికిపైగా వీడియోలు చేశా. ఒక్కోసారి ఇదంతా నాకూ నమ్మశక్యంగా అనిపించదు. కానీ ఎలా సాధ్యమైందంటే...
మాది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నాన్న రామారావు ఆర్టీసీ కండక్టర్. అమ్మ భారతి గృహిణి. నాకో చెల్లి. బీటెక్ చేశాక పెళ్లైంది. మావారు సురేశ్‌ది సూర్యపాలెం. ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్. మా వారికీ ఓ ఛానెల్ ఉంది. తను పరిచయం చేశాకే దాని గురించి తెలిసింది. తన ప్రోద్బలంతోనే 2017లో ‘హెవెన్లీ హోమ్మేడ్’ పేరుతో ఛానల్ మొదలుపెట్టా. నాకు మొదట్నుంచీ ఫ్యాషన్ అంటే చాలా ఆసక్తి. కోర్సులేమీ చేయలేదు కానీ ట్రెండ్స్‌ని బాగా ఫాలో అవుతా. అందానికీ ఇంటి చిట్కాలనే పాటిస్తా. వాటినే అందరితో పంచుకోవాలనుకున్నా. కానీ సమస్యేంటంటే.. నాకు స్టేజ్ ఫియర్. చిన్నప్పటి నుంచి ఇంటా బయటా ఎవరితోనూ పెద్దగా మాట్లాడే దాన్ని కాదు. మా వారి ప్రోత్సాహంతోనే ధైర్యంగా ముందడుగేశా. వీడియో తీయడం, ఎడిటింగ్ వంటివీ తనే నేర్పారు. మొదట్లో ఎన్ని వీడియోలు చేసినా వ్యూస్ వచ్చేవి కాదు. దీనికితోడు నెగెటివ్ కామెంట్లు. కొందరి వ్యాఖ్యలతో చాలా ఇబ్బందిగా అనిపించేది. ఎందుకలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థమయ్యేది కాదు. పెళ్లయిన అమ్మాయిని! అత్తింటివాళ్లు, బంధువులు ఏమనుకుంటారో అని భయం. దాంతో చాలా ఒత్తిడి, డిప్రెషన్‌కు గురయ్యా. కానీ మా అత్తగారు వాళ్లు ఇవన్నీ మామూలే.. పట్టించుకోవద్దు అంటూ వెన్నుతట్టారు. వాళ్ల ప్రోత్సాహం నాలో నూతనోత్సాహాన్ని నింపింది.
వీటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకు సాగడం మొదలుపెట్టా. ఏడాది తర్వాత వ్యూస్ పెరిగాయి. రాబడీ మొదలైంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కోట్ల మంది మనల్ని చూస్తున్నప్పుడు బాధ్యత ఉండాలిగా! అందుకే ఏదో ఒకటి అన్నట్టు చేయను. నేను మధ్యతరగతి అమ్మాయినే కాబట్టి, ఎక్కువగా వాళ్లను దృష్టిలో ఉంచుకునే వీడియోలు చేస్తా. స్కిన్‌కేర్ నుంచి దుస్తుల వరకు తక్కువ ఖర్చుతోపాటు ఫ్యాషన్ ధోరణులకు అనుగుణంగా సమాచారాన్నిస్తా. ఏదైనా నేను ప్రయత్నించి చూశాకే వాళ్ల ముందుకు తెస్తా. ఈ పరిశోధనకే రోజూ చాలా సమయం కేటాయిస్తా. ఒకరోజే 3 వరకూ వీడియోలు తీసి మరుసటి రోజు ఎడిట్ చేస్తా. సందేహాలకు, వీడియో తీసే అవసరమున్నా మావారు సాయం చేస్తారు.
మొదట్లో నా వీడియోలను చూసి స్నేహితులు, బంధువులు ఆశ్చర్యపోయేవారు. చాలా సైలెంట్ అమ్మాయిని. గలగలా మాట్లాడేస్తుంటే ఆశ్చర్యపోరూ! కానీ వాళ్లూ చాలా ప్రోత్సహించారు. ఇతర యూట్యూబర్లు.. లాస్య, శివజ్యోతి, సుష్మా కిరణ్ వంటి చాలామంది స్నేహితులయ్యారు. అప్పుడప్పుడూ కలుసుకునేవాళ్లం. కొవిడ్ వల్ల కొంత గ్యాప్ వచ్చింది. బాగున్న వాటి గురించి కాంప్లిమెంట్లూ ఇచ్చుకుంటాం. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. నెగెటివ్ కామెంట్లనూ పట్టించుకోవడం మానేశా. ఫీడ్‌బ్యాక్, సీరియస్ సలహాలను మాత్రం గుర్తుంచుకుంటా, పాటిస్తా. ఇటీవలే ‘శ్రీమగువ’ ఆన్లైన్ క్లాతింగ్ స్టోర్నీ ప్రారంభించా. ప్రముఖ వస్త్ర బ్రాండ్లకు మోడలింగ్ చేస్తున్నా. భయం భయంగా ప్రారంభించిన నేను ఇవన్నీ ఉత్సాహంగా చేస్తున్నానంటే.. ఇష్టమైన పని చేస్తుండటమే కారణం. అందుకే సీరియళ్లలో అవకాశమొచ్చినా ఆసక్తి లేక వదులుకున్నా. నచ్చిన కెరియర్నే ఎంచుకోమన్నది తోటి అమ్మాయిలకు నా సలహా. పెళ్లైనా కెరియర్, స్వతంత్రంగా ఎదగడంపై దృష్టి పెట్టాలి. ధైర్యంగా ముందుకు సాగితేనే ఏదైనా సాధించగలం.