
తెలంగాణ
ఏపీ మంత్రిపై భాజపా ఎంపీల ధ్వజం
ఈనాడు, అమరావతి: ఏపీ అధికార పార్టీలో కొంతమంది తమకు భాజపా ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారని, దానిలో ఇసుమంత కూడా నిజం లేదని భాజపా రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయిన ఘటనలో వాస్తవాలను వివరించిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌పై ఏపీ మంత్రి అనిల్‌కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. విజయవాడలో శనివారం వీరు విలేకర్లతో మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టుపై వాస్తవాలను వివరించినందుకు షెకావత్‌పై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెడతారా? అని సీఎం రమేష్ ప్రశ్నించారు. ‘అన్నమయ్య ప్రాజెక్టు ముప్పు మానవ తప్పిదం, బాధ్యతారాహిత్యమే. కడప జిల్లా కలెక్టర్ కూడా సరిగా స్పందించలేదు. వరద వచ్చి 36 గంటలైనా తాగునీరు ఇవ్వకుండా ప్రజలను అవస్థల పాల్జేశారు’ అని పేర్కొన్నారు.
సుజనాచౌదరి మాట్లాడుతూ ‘వైకాపా వారు మాకు రాజకీయ ప్రత్యర్థులు. మూడు రాజధానుల బిల్లులను ఎందుకు ప్రవేశపెట్టారో.. ఎందుకు ఉపసంహరించుకున్నారో అర్థం కావడం లేదు. పోలవరం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంగా వ్యవహరిస్తోంది. ఇవన్నీ కేంద్రానికి చెప్పి చేస్తున్నామని కొందరు వైకాపా నేతలు అసత్యప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో నలుగురైదుగురు వ్యక్తులు.. వ్యవస్థలను దోచుకుంటున్నారని ప్రజలకు అర్థమవుతోంది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమైంది’ అని అన్నారు.