
గ్రేటర్ హైదరాబాద్
ఇళ్ల యజమానుల నుంచి భారీగా వసూలు
సొమ్ములు ఇవ్వకుంటే నిర్మాణం కష్టమే
ఓరుగల్లులో ఇదీ సంగతి
ఈనాడు- వరంగల్, కార్పొరేషన్- న్యూస్‌టుడే: కార్పొరేటర్ అంటే డివిజన్లో ప్రజలకు ఏ కష్టమొచ్చినా వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలి. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు సక్రమంగా సరఫరా అవుతుందా లేదా చూడాలి. కానీ వరంగల్ మహానగరంలోని కొందరు కార్పొరేటర్ల తీరుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భవనాలు కట్టుకోవడమే పాపమన్నట్లు, యజమానుల నుంచి భారీగా వసూళ్లకు దిగుతున్నారు. బల్దియా నుంచి ఇంటి అనుమతులు తీసుకున్నా అనధికారికంగా తమకు కప్పం కట్టాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పలువురు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిర్మాణాల వద్దకు వెళ్లి కొన్ని డీవియేషన్లను ఎత్తిచూపుతూ ఈ సమస్య పరిష్కారం కావాలంటే స్థానిక కార్పొరేటర్ వద్దకెళ్లి మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. చేసేదేం లేక యజమానులు కార్పొరేటర్‌కు రూ.వేలు, లక్షలు చెల్లించి ఇంటి పనులు చేసుకుంటున్నారు.
ఆమ్యామ్యా ఇవ్వాల్సిందే...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ విస్తీర్ణం 406 చదరపు కిలోమీటర్ల కాగా, 66 డివిజన్ల పరిధిలో 10 లక్షల జనాభాతో విస్తరించింది. ప్రతి నెలా భవన నిర్మాణాల అనుమతి కోసం 1000 నుంచి 1200 దరఖాస్తులు మహానగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి వస్తాయి. భవనాల అనుమతుల నిమిత్తం గ్రేటర్‌కు రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. మరోవైపు కొందరు పాలకులకు ఆమ్యామ్యాలు చెల్లించక తప్పడంలేదు. వరంగల్ బల్దియా కొత్త పాలకవర్గం మే నెలలో కొలువుతీరింది. కొన్నిచోట్ల మహిళా కార్పొరేటర్ల భర్తలు పెత్తనం చేస్తున్నారు. ఈ వసూళ్లపర్వంపై ఇటీవల ట్విటర్లో రాష్ట్ర పురపాలకశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. దీనిపై విచారణ చేయాలని పురపాలకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదేశించారు.
మచ్చుకు కొన్ని...
* వరంగల్ ప్రాంతంలో ఓ వ్యాపారి జీ+2 భవనానికి అనుమతి పొందారు. అదనంగా మరో అంతస్తు వేస్తుంటే కార్పొరేటర్ భర్త రంగప్రవేశం చేశారు. రూ.3 లక్షలు డిమాండ్ చేసి.., చివరకు రూ.40 వేలు తీసుకున్నారు. మూడు నెలలు కాగానే మళ్లీ అదనంగా డబ్బులు కావాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బందిని పంపి నిర్మాణ పనులు నిలిపివేయిస్తున్నారు.
* నగరంలోని ఓ పాతఇంటిపై మరో అంతస్తు వేస్తుండగా అధికారి వెళ్లి పనులు అడ్డుకున్నారు. స్థానిక కార్పొరేటర్‌కు రూ.15 వేలు చెల్లించాకే నిర్మాణం ముందుకు సాగింది.
* స్థానికంగా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి 3 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి పొందారు. కార్పొరేటర్ భర్త డబ్బులు డిమాండ్ చేస్తే ససేమిరా అన్నారు. పనులు జరగకుండా మిషన్ భగీరథ పైపులైను పేరుతో గుంతలు తీయించారు. చివరకు బాధ భరించలేక సదరు యజమాని రూ.లక్ష చెల్లించేందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది.
* వరంగల్ ప్రాంతంలోని కొన్ని కాలనీలు చారిత్రక కట్టడాలున్న ప్రాంతంలోకి వస్తాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టడం నిషేధం. కానీ కార్పొరేటర్లు అడిగినంత ఇస్తే నిర్మాణాలు చేసేసుకోవచ్చు. ఖిలావరంగల్ ప్రాంతంలో గతంలో రోడ్డును ఆక్రమించి ప్రహారీ కడితే అధికారులు కూల్చేశారు. కానీ ఒకరు తన పలుకుబడితో మళ్లీ కట్టారు. అధికారులెవ్వరూ అటువైపు వెళ్లకపోవడం గమనార్హం.
* హనుమకొండలోని ఓ కార్పొరేటర్ అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా కొందరు అపార్టుమెంట్లే కడుతున్నారు. అయినా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అటువైపు వెళ్లకపోవడం గమనార్హం.
* హనుమకొండలో ఓ కార్పొరేటర్ పాత ఇల్లు కొనుగోలు చేసి.. దానికి ముందువైపున్న ఇంటిని అమ్మాలని సదరు యజమానిపై ఒత్తిడి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గోడ కడుతున్నారని బాధితుడు ఇప్పటికే గ్రేటర్ వరంగల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.