
తెలంగాణ
నా తల్లిదండ్రులిద్దరూ క్యాన్సర్ బాధితులే: మంత్రి హరీశ్‌రావు
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: రానున్న రెండేళ్లలో వైద్యరంగంలో దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో శనివారం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తనది క్యాన్సర్ బాధిత కుటుంబమని.. తన తండ్రి పదేళ్ల నుంచి, తల్లి ఆరేడేళ్ల నుంచి మహమ్మారి బారినపడి చికిత్స పొందుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యం, చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పెంచాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిని రూ.120 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానాగా తీర్చిదిద్ది.. 450 పడకల స్థాయికి పెంచుతున్నామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కిడ్నీ, గుండె, క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెండేళ్లలో అయిదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఇందులో ఒకటి వరంగల్‌లో, మరో నాలుగు హైదరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాల ఏర్పాటుకు ‘తానా’ ముందుకు వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హరీశ్‌రావు చెప్పారు. తన నెల వేతనాన్ని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు ఆయన విరాళంగా అందించారు. వసుధ ఫార్మా ఫౌండేషన్ నిర్వాహకుడు ఎంవీ రామరాజు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మూవర్స్.కామ్ సీఈవో విద్యా గారపాటి, ప్రిజ్మ్ థెరప్యూటిక్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కిరణ్ అవంచ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సీఈవో చినబాబు సుంకవల్లి, వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ ప్రమీలారాణి, సుజాతరావు, సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్‌మిశ్ర తదితరులు పాల్గొన్నారు.