
గ్రేటర్ హైదరాబాద్
12న ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
నారాయణగూడ, న్యూస్టుడే: కవి, విమర్శకుడు, ఉపాధ్యాయుడిగా సాహిత్య, విద్యావ్యాప్తికి కృషి చేసి.. ఎంతో మందిని కవులు, రచయితలుగా తీర్చిదిద్దిన డా.కూరెళ్ల విఠలాచార్య, కూచిపూడి, ఆంధ్రనాట్యంలో గురువుగా, నర్తకుడిగా విశేష సేవలు అందించిన కళాకృష్ణలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన విశిష్ట పురస్కారాలు ప్రకటించింది. విఠలాచార్య 1938లో యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో జన్మించారు. 22 పుస్తకాలు వెలువరించారు. ఉద్యోగ విరమణ అనంతరం పరిశోధన విద్యార్థులకు ఉపయోగపడేలా తన స్వగృహంలో సుమారు రెండు లక్షల పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. కళాకృష్ణ 1951లో కరీంనగర్ జిల్లాలో జన్మించారు. సుప్రసిద్ధ నాట్యాచార్యులు డా.నటరాజ రామకృష్ణ వద్ద ఆంధ్ర నాట్యాన్ని అభ్యసించారు. భరతనాట్యం, కూచిపూడిల్లోనూ శిక్షణ పొందారు. ‘నవజనార్దన పారిజాతం’ ప్రదర్శనతో తనదైన ముద్రవేశారు. అభినవ సత్యభామగా పేరుపొందారు. డిసెంబరు 12న హైదరాబాద్లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగే కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వీరిరువురికీ పురస్కారం కింద రూ.లక్ష చొప్పున నగదు, ప్రశంసాపత్రాలు అందజేస్తారని వర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.