Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
చిరకాల చెలిమి... కదనాన బలిమి!

నేడు దిల్లీకి రష్యా అధినేత పుతిన్‌

భారత్‌, రష్యాల 20వ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నేడు దిల్లీకి వస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కొన్నాళ్లుగా స్వదేశాన్ని వీడని పుతిన్‌కు చాలాకాలం తరవాత ఇదే తొలి విదేశీయానం. రక్షణ ఒప్పందాలే ప్రధాన అజెండాగా ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్‌ భేటీ కానున్నారు. అదే సమయంలో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు సెర్గీ లవ్రోవ్‌, సెర్గీ షొయిగు; ఎస్‌.జైశంకర్‌,  రాజ్‌నాథ్‌సింగ్‌ ‘2+2 భేటీ’ కానున్నారు. ఇరుదేశాల నడుమ ఈ తరహా చర్చలు ఇవే తొలిసారి. ఇండియా ఇప్పటివరకు అమెరికాతో మాత్రమే 2+2 తరహా చర్చలు జరిపింది. పుతిన్‌ పర్యటన  ఇరుదేశాల చిరకాల మైత్రిని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ, అణు, ఇంధన, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తృతం చేయనుందని ఆశిస్తున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని నిలువరించేందుకు ఏర్పడిన అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ క్వాడ్‌ కూటమిపై అసంతృప్తిగా ఉన్న మాస్కో- ఇటీవల బీజింగ్‌తో సాన్నిహిత్యం పెంచుకుంటోంది. మరోవైపు చైనా నుంచి ముప్పును ఎదుర్కొనే లక్ష్యంతోనే రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులతో పాటు పలురకాల ఆయుధ సంపత్తిని ఇండియా సమకూర్చుకుంటోంది. వాటి కొనుగోలు తమ రక్షణ ప్రయోజనాలకు విఘాతకరమని, డేటా చోరీకి ఆస్కారముందని భావిస్తున్న అగ్రరాజ్యం కాట్సా ఆంక్షల విధింపుపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ తరుణంలో పుతిన్‌ పర్యటన ఫలాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం.

విడదీయలేని రక్షణ అనుబంధం

‘మనకు అత్యంత మిత్ర దేశం ఏది అని ఏ భారతీయ పిల్లవాడిని అడిగినా వెంటనే రష్యా పేరు చెబుతారు’ అని మోదీ ఏడేళ్లక్రితం మాస్కో పర్యటనలో వ్యాఖ్యానించారు. భారత్‌, రష్యాల మధ్య స్నేహగంధం అలా పరిమళిస్తూనే ఉండాలన్న అర్థాన్ని ఆ పలుకులు స్ఫురింపజేస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం రక్షణ, సైనిక సహకారానికి రష్యాపైనే ఆధారపడిన భారత్‌- ఇప్పటికీ 62శాతం ఆయుధ సంపత్తి, సైనిక పరికరాలను ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటోంది. నాటి బ్రహ్మోస్‌ క్షిపణి, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, చక్ర-2 జలాంతర్గాములు, టీ-90, టీ-72 యుద్ధట్యాంకులు వంటివి వాటిలో మచ్చుకు కొన్ని. తాజా పర్యటనలో ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ సహా 6.71 లక్షల ఏకే-203 అసాల్ట్‌ రైఫిళ్ల కొనుగోలు ఒప్పందాలు ఖరారు కానున్నాయి. వాటి వాణిజ్య విలువ సుమారు అయిదు వేల కోట్ల రూపాయలు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో నెలకొల్పనున్న ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఐఆర్‌ఆర్‌పీఎల్‌)లో వాటి తయారీ చేపట్టనున్నారు. తొలుత 70 వేల తుపాకులను తమ వద్దే తయారుచేసి ఇండియాకు దిగుమతి చేయనున్న మిత్రదేశం- ఆ తరవాత సాంకేతికతను బదిలీ చేసి దేశీయంగానే ఉత్పత్తిని ప్రారంభించనుంది. ‘భారత్‌లో తయారీ’ (మేకిన్‌ ఇండియా) నినాదానికి ఇది ఆచరణరూపంగా కేంద్రం చెబుతోంది. మరోపక్క ప్రతిపాదిత వ్లాదివోస్తాక్‌-చెన్నై సముద్ర నడవా ఏర్పాటుకు ముందడుగు పడాలని భారత్‌ భావిస్తోంది. 10 వేల కిలోమీటర్ల ఈ సాగరమార్గం అందుబాటులోకి వస్తే ఆర్కిటిక్‌ ప్రాంతంతో హిందూ మహాసముద్రానికి అనుసంధానం పెరుగుతుంది. తాజాగా అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న తరుణంలో రష్యా స్పందించిన తీరు భారత్‌కు ఆమోదయోగ్యం కాలేదు. మానవతా దృక్పథంతో అఫ్గాన్లకు సాయం చేయడానికి ముందుకొచ్చిన భారత్‌- అక్కడ శాంతి, సామరస్యాలు నెలకొల్పేందుకు చొరవ తీసుకుంది. ఉగ్రముఠాలతో తాలిబన్ల సంబంధాలు తెంచడం, మానవతా సంక్షోభాన్ని నివారించడంలో రష్యా కలిసిరావాలని ఆశిస్తోంది. మోదీ-పుతిన్‌ భేటీ ఈ సమస్యకు ఓ తార్కిక ముగింపు పలికితే ఆసియా ప్రాంతీయ సమగ్రతను కాపాడటంలో సఫలమైనట్లుగా భావించవచ్చు.

అభ్యంతరాలను తోసిరాజని...

భారత్‌ ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకోవడంపై అమెరికా తన వైఖరిని ఇదమిత్థంగా ప్రకటించలేదు. కాట్సాను వర్తింపజేస్తుందా లేదా అనే ప్రశ్న దౌత్యవర్గాల్లో తలెత్తుతోంది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఇటీవల స్పందిస్తూ ‘భారత్‌ మాకు వ్యూహాత్మకంగా అతిపెద్ద రక్షణ భాగస్వామి. మా సంబంధాలను కాపాడుకుంటాం’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. గాల్వాన్‌లోయ సహా సరిహద్దుల వెంబడి డ్రాగన్‌ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. తనతో అంటకాగే పాకిస్థాన్‌కు సైనిక సహకారాన్ని అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఈ తరుణంలో భారత్‌ సైతం ఎస్‌-400 క్షిపణులను సమకూర్చుకోవడం అత్యావశ్యకం. భారత విదేశాంగ, రక్షణ శాఖల ఉన్నతాధికారులు సైతం అదే చెబుతున్నారు. ‘మన విదేశాంగ విధానాన్ని, సార్వభౌమత్వాన్ని ఏ దేశమూ ప్రశ్నించజాలదు. యూఎస్‌ సైతం కాట్సాను ప్రయోగిస్తుందని అనుకోవడంలేదు. రష్యాతో దీర్ఘకాల స్నేహంలో ఎన్నో ఒడంబడికలు జరిగాయి. తాజా ఒప్పందాన్ని సైతం ఆ కోవలోనే చూడాలి’ అంటున్నారు. పలువురు సెనేటర్లు కాట్సా నుంచి ఇండియాకు మినహాయింపు ఇవ్వాలని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్ళెం వేయాలంటే భారత్‌కు ఈ తరహా సైనిక సన్నద్ధత అవసరమని అధ్యక్షుడు బైడెన్‌కు లేఖలు రాశారు. ఇప్పటికే ఈ తరహా ఆయుధ వ్యవస్థ కలిగి ఉన్న చైనా- తాజా ఒప్పందంపై గుర్రుగా ఉండటం దాని ద్వంద్వనీతికి అద్దం పడుతోంది. రష్యా మాత్రం అమెరికా ఆంక్షలను పట్టించుకోనక్కర్లేదని చెబుతోంది. కొంతకాలంగా చైనాతో అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ- ఈ ఒప్పందంపై ప్రభావం పడకుండా లౌక్యంగా వ్యవహరిస్తోంది. ఇండో-రష్యా స్నేహబంధం... ప్రపంచ యుద్ధాల కాలం నుంచి ప్రచ్ఛన్న పోరు దశ వరకూ ఎన్నో కాలపరీక్షలకు తట్టుకొని నిలబడింది. పరస్పర ప్రయోజనాలే ప్రాతిపదికగా, ప్రాంతీయ సమగ్రతే పునాదిగా ఇరుదేశాలు ప్రతినబూనితేనే పుతిన్‌ పర్యటన ఫలవంతమై ఇరుదేశాల స్నేహబంధం పటిష్ఠమవుతుంది.


ఆసియా దేశాలకూ ప్రయోజనకరం

ప్రస్తుతం భారత్‌, రష్యాల ద్వైపాక్షిక వ్యాపారం విలువ రూ.75వేల కోట్లు. 2025 నాటికి దీన్ని రెండు లక్షల కోట్ల రూపాయలకు పెంచుకోవాలన్నది లక్ష్యం. ఇందుకు రక్షణ, సైనిక విభాగాలతో పాటు ఇంధన, చమురు, సహజవాయు రంగాల్లోనూ విరివిగా పెట్టుబడులు పెట్టాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి. రాజకీయంగానూ మాస్కో-దిల్లీ నడుమ అనుబంధం చిక్కబడితే అది మధ్య ఆసియా దేశాలకూ ప్రయోజనకారి అవుతుంది. రెండు దేశాల మైత్రి సోవియట్‌ విచ్ఛిన్నం తరవాత కొంత ఒడుదొడుకులకు లోనైంది. సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల ఫలితంగా పీవీ నరసింహారావు జమానాలో అగ్రరాజ్యానికి కాస్త చేరువైన ఇండియా- మాస్కోతో బంధాన్ని బలంగా కాపాడుకోలేకపోయింది. యురేసియా, పశ్చిమాసియా, గల్ఫ్‌ దేశాలతో రష్యా వ్యవహార శైలి సైతం ఇందుకు కారణమైంది.

- బోండ్ల అశోక్‌


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.