
ఆంధ్రప్రదేశ్
మొత్తం 15 మంది దుర్మరణం
నాగాలాండ్‌లో తిరుగుబాటుదారులుగా పొరబడి బలగాల కాల్పులు
ఆగ్రహంతో విధ్వంసం సృష్టించిన స్థానికులు.. మళ్లీ కాల్పులు
కోహిమా, గువాహటి, దిల్లీ
పౌరుల కాల్చివేతకు నిరసనగా ఓటింగ్ గ్రామస్తులు తగులబెట్టిన వాహనాలు
ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో ఘోరం చోటుచేసుకుంది. తిరుగుబాటుదారులుగా పొరబడి- సామాన్య కూలీలపై భద్రత బలగాలు శనివారం కాల్పులు జరపడం కల్లోలం సృష్టించింది. ఈ ఘటనతో పాటు తర్వాత చోటుచేసుకున్న కాల్పుల్లో కలిపి మొత్తం 14 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. బలగాల చర్యకు ఆగ్రహంతో ఊగిపోయి స్థానికులు సృష్టించిన విధ్వంసంలో ఓ సైనికుడు (కమాండో) ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది సిబ్బంది గాయపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కాల్పులపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసింది. సైన్యం కూడా విచారణకు ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నాగాలాండ్ సీఎం నీఫియు రియో, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సహా పలువురు తాజా కాల్పులపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
పాటలు పాడుతూ ఇంటికి చేరుతుండగా..
నాగాలాండ్‌లో.. మయన్మార్‌తో సరిహద్దుల్లో మోన్ జిల్లా ఉంది. అక్కడి ఓటింగ్ గ్రామం సమీపంలో నిషేధిత ఎన్ఎస్సీఎన్(కె) సంస్థకు చెందిన యంగ్ ఆంగ్ చీలికవర్గం తిరుగుబాటుదారులు సంచరిస్తున్నట్లు బలగాలకు నిఘా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన బలగాలు.. ఆపరేషన్‌ను ప్రారంభించాయి. మెరుపు వేగంతో తిరు, ఓటింగ్ గ్రామాల మధ్య రోడ్డులోకి ప్రవేశించాయి. ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వాహనంపై కాల్పులు జరిపాయి. అయితే- వాహనంలో ఉన్నది తిరుగుబాటుదారులు కాదు. సామాన్య కూలీలు. వారంతా రోజూలాగే ఓ బొగ్గు గనిలో పనికి వెళ్లి సాయంత్రం వేళ ఇంటికి తిరిగొస్తున్నారు. పని బడలికను వదిలించుకునేందుకు.. వాహనంలో పాటలు పాడుతూ సేదతీరుతున్నారు. వారిని తిరుగుబాటుదారులుగా బలగాలు పొరపడటంతో ఘోరం జరిగిపోయింది. ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రాంతంలో తిరుగుబాటుదారులను అణచివేయడంలో దీర్ఘకాలంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న అస్సాం రైఫిల్స్‌తో పాటు స్థానిక పోలీసులకు సమాచారమివ్వకుండా సైన్యానికి చెందిన పారా ప్రత్యేక బలగాల్లోని ఓ ఎలైట్ యూనిట్ తాజా ఆపరేషన్‌ను చేపట్టడం గమనార్హం.
బలగాలను చుట్టుముట్టి..
చీకటి పడుతున్నా కూలీలు ఇళ్లకు చేరుకోకపోవడంతో.. గ్రామస్థులు ఆందోళన చెందారు. వారికోసం వెతుకుతూ వందల మంది వెళ్లారు. కాల్పుల సంగతి తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. బలగాలను చుట్టుముట్టి దాడి చేశారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఆత్మరక్షణ కోసం సిబ్బంది మళ్లీ కాల్పులు జరపడంతో.. ఏడుగురు స్థానికులు మృత్యువాతపడ్డారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరికొంతమంది సిబ్బంది గాయపడ్డారు. తాజా కాల్పుల ఘటనల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వారిద్దరినీ అస్సాంకు తరలించామని, మిగతావారికి నాగాలాండ్‌లోనే చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
ఆగని ఆగ్రహజ్వాలలు
తాజా ఘటన నేపథ్యంలో నాగాలాండ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాల్పులు జరిపిన భద్రత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. మోన్ పట్టణంలో ఆందోళనకారులు ఆదివారం కొన్యాక్ యూనియన్ కార్యాలయాలను ధ్వంసం చేశారు. అస్సాం రైఫిల్స్ శిబిరానికీ నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. అక్కడ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. ఆందోళనకారుల దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నివారించేందుకుగాను జిల్లా వ్యాప్తంగా మొబైల్ అంతర్జాలం, సంక్షిప్త సందేశ (ఎస్ఎంఎస్) సేవలను అధికారులు నిలిపివేశారు. రాష్ట్రానికి తలమానికంగా భావించే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ జరుగుతున్నవేళ తాజా కాల్పులు చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాల్పులకు నిరసనగా ఈ దఫా ఉత్సవాల్లో పాల్గొనకూడదని 11 గిరిజన సంఘాలు నిర్ణయించుకున్నాయి. తాజా కాల్పులను తూర్పు నాగాలాండ్ ప్రజల సంస్థ(ఈఎన్‌పీవో), ఎన్ఎస్సీఎన్(ఐఎం) తీవ్రంగా ఖండించాయి. ఇండో-నాగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన 1997 నాటి నుంచి చోటుచేసుకున్న అత్యంత దురదృష్టకర ఘటనల్లో ఇదొకటని ఎన్ఎస్సీఎన్(ఐఎం) పేర్కొంది.
విచారణకు ఆదేశించిన సైన్యం
నాగాలాండ్‌లో సామాన్య పౌరులపై కాల్పులు చోటుచేసుకోవడంపై సైన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’కి ఆదేశించింది. ‘‘తిరుగుబాటుదారుల కదలికలపై మాకు విశ్వసనీయ నిఘా సమాచారం అందింది. దాని ఆధారంగానే మోన్ జిల్లాలోని తిరు ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టాం. కానీ అక్కడ జరిగిన కాల్పులు, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర విచారకరమైనవి. అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు జరుపుతాం. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా పరిణామాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం.నరవణెకు సైన్యం నివేదించింది.
తీవ్ర వేదన కలిగించింది
నాగాలాండ్‌లోని ఓటింగ్‌లో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటన తీవ్ర మనోవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి సిట్ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతుంది.
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
ఓటింగ్ వద్ద అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. కాల్పుల ఘటనపై ఉన్నత స్థాయి సిట్ దర్యాప్తు చేస్తుంది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శాంతంగా ఉండాలని అన్నివర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నా.
- నీఫియు రియో, నాగాలాండ్ సీఎం
హోంశాఖ ఏం చేస్తున్నట్టు?
ఇది హృదయ విదారక ఘటన. కేంద్రప్రభుత్వం తప్పనిసరిగా సమాధానమివ్వాలి. దేశంలో అటు పౌరులు, ఇటు భద్రత సిబ్బంది సురక్షితంగా లేరు. మరి హోం శాఖ ఏం చేస్తున్నట్టు?
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత