
ఆంధ్రప్రదేశ్
రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు
మహాపాదయాత్రలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లాలో 35వ రోజు యాత్రకు విశేష స్పందన
నెల్లూరు జిల్లా గూడూరు మండలం నెర్నూరు వద్ద అమరావతి మహాపాదయాత్రలో పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఈనాడు డిజిటల్ - నెల్లూరు: బాలాయపల్లి, గూడూరు గ్రామీణం - న్యూస్టుడే: ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు (పాలసీలు) మారకూడదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ప్రస్తుతం రోడ్డునపడ్డారని, వారి కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలిగి.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని, అక్కడ ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాలని కోరారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర 35వ రోజు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపిన లక్ష్మీనారాయణ మాట్లాడారు. ‘అమరావతి రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. రాజధానిని అభివృద్ధి చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటున్నారు తప్ప.. మాకు అన్యాయం జరిగిందని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్ర కూడా వారి స్వార్థం కోసం కాదు. రాష్ట్రం బాగు కోసమే. రాష్ట్రం బాగుపడాలంటే ఒక రాజధాని ఉండాలి. రాజధానిపై స్పష్టత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతూ, పెట్టుబడులు రాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మళ్లీ తీసుకొస్తామంటున్న మూడు రాజధానుల బిల్లు ఎలా ఉంటుందో వేచి చూడాలి’ అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే అందరి ధ్యేయమన్నారు. ‘కావాలనుకుంటే ప్రభుత్వం శీతాకాల సమావేశాలు లాంటివి విశాఖ లేదా కర్నూలులో పెట్టుకోవాలి. కోనసీమను మత్స్య ఉత్పత్తుల రాజధాని (ఆక్వా క్యాపిటల్)గా, ప్రకాశాన్ని రవాణా రాజధాని (ట్రాన్స్పోర్టు క్యాపిటల్)గా, రాయలసీమను గనుల రాజధాని (మినరల్స్ క్యాపిటల్)గా ప్రకటించి అభివృద్ధి చేయాలి’ అని సూచించారు. పాదయాత్రలో రైతులు, పోలీసులు సంయమనంతో సాగాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం వివాదాలకు కారణమైన వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావును ఆదివారం పాదయాత్ర విధులకు అధికారులు దూరంగా ఉంచారు.
చెన్నై తెలుగువాసుల మద్దతు
అమరావతి నిర్మాణానికి అహర్నిశలు పోరాడుతూ మహా పాదయాత్ర చేస్తున్న ఐకాస ప్రతినిధులు, రైతులకు చెన్నై తెలుగువాసులు సంఘీభావం తెలిపారు. ఆదిశేషయ్య, నరేంద్ర, చంద్రశేఖర్లతో పాటు.. మరో 50 మంది పాల్గొని మద్దతు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా అమరావతి మా రాజధాని అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది భూములిచ్చిన రైతుల చలవేనని చెప్పారు. సాటి తెలుగువారు పడుతున్న కష్టాన్ని చూసి తమ వంతు సాయం చేసేందుకు వచ్చామన్నారు. ఇప్పటికే చిన్నాభిన్నమైన రాష్ట్రం భవిష్యత్తు తరాల కోసం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. తామంతా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినా సాటి తెలుగువారికి జరుగుతున్న అన్యాయానికి బాధ పడుతున్నామని చెప్పారు. తమ తాతతండ్రులు ఇక్కడే వ్యవసాయం చేసి తమను ఉన్నతస్థానంలో నిలిపారని, అలాంటి రైతులు కంటతడి పెడుతుంటే చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమవంతుగా యాత్రకు రూ.7 లక్షలు అందిస్తున్నామన్నారు. ఇది సాయం కాదని, తమ బాధ్యతన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా అమరావతి మా రాజధాని అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది రైతుల చలవేనని చెప్పారు. వీరితోపాటు ఆస్ట్రేలియా ఎన్నారై ఫ్రెండ్స్ రూ.లక్ష, గుంటూరు జిల్లా గూడవల్లి గ్రామస్థులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.