
ఆంధ్రప్రదేశ్
వర్షాలకు కుళ్లిపోతున్న వరి, సెనగ, మినుము పంటలు
నీరు నిలిచి మిరపకు దెబ్బ
కుంగిపోతున్న అన్నదాత
ఈనాడు, అమరావతి: వరి ఊడ్చుకుపోయింది.. సెనగ పొలంలోనే కుళ్లిపోయింది.. పత్తి పూత, కాయ రాలిపోయింది.. ఇవే కాదు, మినుము, మొక్కజొన్న, చెరకు తదితర పంటలు వేల ఎకరాల్లో చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో సాగుదారులకు కంటిమీద కునుకు కరవైంది. కదిలిస్తే చాలు కన్నీరు.. వరదై పారేలా ఉంది. నవంబరు నెలలో కురిసిన వానలకు ప్రభుత్వ అంచనాల ప్రకారమే 13 జిల్లాల్లో 13.24 లక్షల ఎకరాల్లో రూ.3,300 కోట్ల పంటనష్టం వాటిల్లింది. అంతకుముందు జూన్ నుంచి అక్టోబరు వరకూ జరిగిన నష్టమూ తక్కువేమీ కాదు. తొలకరిలో వేసిన పంట చేతికొచ్చే సమయంలో కుండపోత వానలకు అనంతపురం, చిత్తూరు జిల్లాలో లక్షల ఎకరాల్లో పశువుల మేతకూ పనికిరాని విధంగా దెబ్బతింది. మరోపక్క ఆశించిన వర్షాల్లేక కర్నూలు జిల్లాలో దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో గులాబ్ తుపాను ధాటికి వరితో పాటు ఇతర పంటలూ పాడయ్యాయి. వైరస్, తామరపురుగు మిరప మొక్కల్ని పీల్చివేస్తుండటంతో రైతులు పంటనే దున్నేస్తున్నారు. దెబ్బమీద దెబ్బలా నవంబరులో కురిసిన వానలు సాంతం ఊడ్చిపెట్టేశాయి.
అన్ని ప్రాంతాల్లోనూ అదే వ్యధ
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న వరి 6.10 లక్షల ఎకరాల్లో దెబ్బతింది. రైతులు ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టగా.. గింజ కూడా చేతికిరాని వారు లక్షల్లో ఉన్నారు. కడప, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల నేలవాలింది. రబీలో ప్రధాన పంటగా సాగయ్యే సెనగ నవంబరు మొదటి, రెండో వారంలో కురిసిన వానలకు కుళ్లిపోయింది. నవంబరు మూడో వారంలో ముంచెత్తిన వానలు, వరదలకు కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెనునష్టం సంభవించింది. వరి, సెనగ, మొక్కజొన్న, మిరప, మినుము, వేరుశనగ తదితరాలు అధికంగా దెబ్బతిన్నాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టినా రూపాయి కూడా చేతికి వచ్చేలా లేదని అన్నదాతలు వాపోతున్నారు.
సెనగ... రెండోసారి పెట్టుబడి
రబీలో వరి తర్వాత ప్రధాన పంట సెనగ. నవంబరులో కురిసిన వానలకు మొలక దశలోనే కుళ్లిపోయింది. సాగుకు ఎకరాకు రూ.10వేల వరకు ఖర్చయ్యింది. దీనికి ఇంకా ఈ-క్రాప్ కూడా నమోదుకాలేదు. కడప జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో విత్తనం వేశారు. పంటనష్టం కింద నమోదు చేయలేదని, బీమా వస్తుందో లేదోనని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం విత్తనాలను మాత్రమే రాయితీపై ఇస్తోంది. రైతులు మళ్లీ సెనగ వేసేందుకు రెండోసారి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.
పంటను దున్నేస్తున్నారు
మిరప సాగు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అధికం. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది సాగు పెరిగింది. రైతులు ఎకరాకు రూ.70వేల నుంచి రూ.90 వేల వరకు వెచ్చించారు. తెగుళ్ల నివారణకు పురుగు మందులు చల్లుతున్న దశలోనే వర్షాల కారణంగా దెబ్బతింది. అనంతపురం జిల్లాలోనే సుమారు 11వేల ఎకరాల వరకు పాడైనట్లు అంచనా. పలుచోట్ల పంటల్ని దున్నేస్తున్నారు.
రోజుల తరబడి తడవడంతో..
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం తిరుమలరాజుపురం రైతు అన్నామలైరెడ్డి 1.50 ఎకరాల్లో వరి వేస్తే రూ.35 వేలు ఖర్చయ్యింది. వానలకు కోత దశలోని పైరు నేలవాలింది. రోజుల తరబడి తడవడంతో వడ్లు పొలంలోనే కుళ్లి, మొలకెత్తుతున్నాయని చెబుతున్నారు.
10లో ఆరెకరాలు వర్షార్పణం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతికి చెందిన వెంకటేశ్.. పది ఎకరాల్లో మిరప వేశారు. ఎకరాకు రూ.90వేల వరకు ఖర్చయింది. మొన్నటి వర్షం దెబ్బకు 80% పంట దెబ్బతింది. ‘ఆరెకరాల వరకు పోయినట్లే. విత్తనాలకే రూ.80 వేలు ఖర్చయింది’ అని వాపోయారు.
పైసా కూడా చేతికొచ్చేలా లేదు
నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన నరసింహారెడ్డి 13 ఎకరాల్లో మినుము వేస్తే.. వర్షాలకు పూర్తిగా పాడైపోయింది. ఎకరాకు రూ.13వేల పెట్టుబడి పెట్టారు. పైసా కూడా చేతికొచ్చేలా లేదని, రూ.1.50 లక్షల దాకా నష్టపోతున్నట్లు వాపోయారు.