
ఆంధ్రప్రదేశ్
జనసేన నేత నాదెండ్ల మనోహర్
చెరుకుపల్లి, న్యూస్టుడే: రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, కౌలురైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందంటే రైతు ప్రభుత్వంగా చెప్పుకొంటున్న వైకాపా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని జనసేన పార్టీ పీఏసీ(రాజకీయ వ్యవహారాల కమిటీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా రైతులు పంట నష్టపోతే ఇంతవరకు కనీస వివరాలు కూడా నమోదు చేయకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇసుక ఉచితంగా పంపిణీ చేయాలని మనోహర్ డిమాండ్ చేశారు. నాడు అధికారం కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్ నేడు ఎక్కడా కనిపించడం లేదని.. బహుశా వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. పదవుల కోసం కాదు.. ప్రజల కోసమే జనసేన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్నారు.