
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో ఆడియో ఆదేశాల కలకలం
షోకాజ్ నోటీసు ఇచ్చిన జేసీ
మర్రిపాడు, న్యూస్‌టుడే: ప్రభుత్వ సాయంతో సొంతిల్లు కట్టుకున్న వారు జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)లో రుణాలను తిరిగి చెల్లించాలని చెప్పడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పెద్దలు అది స్వచ్ఛందమే అని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. ఓటీఎస్ చెల్లించని ప్రజలపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో సుస్మితారెడ్డి ఓటీఎస్ చెల్లించని వారికి ప్రభుత్వ పథకాలు ఆపుతామని సిబ్బందికి చెప్పిన ఆడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పంచాయతీ కార్యదర్శులు రోజుకు కనీసం సచివాలయానికి పది ఓటీఎస్లైన నమోదు చేయాలని అందులో ఆదేశించారు. సర్పంచులు, ప్రజాప్రతినిధుల చేత ముందుగా కట్టించి, వారిపై ఒత్తిడి తేస్తే గ్రామాల్లో ప్రజల చేత వారు కట్టిస్తారని పేర్కొన్నారు. వీఆర్వోలు, డిజిటల్ సహాయకులు, వెల్ఫేర్ సిబ్బంది వద్దకు పనులపై వచ్చేవారికి ఓటీఎస్ పెండింగ్ ఉంటే వారి పనులు చేయకుండా పక్కన పెట్టాలని సూచించారు. హౌసింగ్ ఓటీఎస్ కడితేనే పనులు చేయాలని ఆదేశించారు. దీనిపై ఎంపీడీవో సుస్మితారెడ్డిని వివరణ కోరగా.. మండలంలో ఎక్కడా ప్రభుత్వ పథకాలు ఆపలేదని, పై నుంచి వచ్చే సూచనల మేరకు ప్రజలకు నచ్చజెప్పి ఓటీఎస్ కట్టించాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ఎంపీడీవో సుస్మితారెడ్డికి జేసీ గణేష్‌కుమార్ షోకాజ్ నోటీసు జారీచేశారు. లిఖిత పూర్వక సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఓటీఎస్‌పై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని..ప్రజలు ఆందోళనకు గురికావొద్దని జేసీ సూచించారు.