
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, అమరావతి: ‘అన్నమయ్య జలాశయ ప్రమాదంపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు వాణిని వినిపించే ప్రయత్నంలా ఉంది. వరద ప్రాంతాలను, ఆ జలాశయాన్ని పరిశీలించాక కేంద్ర బృందం చేసిన ప్రకటనకు, కేంద్ర మంత్రి చెప్పిన దానికి భిన్నంగా ఉంది’ అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రకృతి విపత్తు వల్లే జలాశయం కట్ట కొట్టుకుపోతే.. మానవతప్పిదంగా చిత్రీకరించేందుకు చంద్రబాబు చూస్తున్నారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం లేదన్నారు. ఓటీఎస్ కింద డబ్బులు కట్టొద్దని, తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని అంటున్న చంద్రబాబు.. అధికారంలో ఉన్నపుడు ఏం చేశారు? మేం లబ్ధిదారులకు పరిపూర్ణ హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం’ అని రాంబాబు పేర్కొన్నారు.