
ఆంధ్రప్రదేశ్
ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో 13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
ఈనాడు-అమరావతి: భారీవర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు.. ఆహార పంటలకు ఎకరాకు రూ.30వేలు, ఉద్యాన, వాణిజ్య పంటలకు రూ.50వేల చొప్పున పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. వైరస్, తామరపురుగుతో మిరప సర్వనాశనం అయిన నేపథ్యంలో ఎకరాకు రూ.50వేల వంతున పరిహారం ఇవ్వాలన్నారు. భారీవర్షాలతో 12.22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వారు వివరించారు. దెబ్బతిన్న ప్రాజెక్టులు, చెరువుల విషయంలో అధికారుల సమన్వయలోపం, నిర్లక్ష్యంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. 12 డిమాండ్ల పరిష్కారానికి డిసెంబరు 13న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. ‘పంటల బీమా, పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేయాలి. ఇసుక మేట, భూమి కోతలకు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు ఇచ్చే పరిహారాన్ని రెట్టింపు చేయాలి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి’ అని కోరారు.