
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్లో ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో ఏకంగా 43 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో గత నెల 20న 134 కొత్త కేసులు నమోదు కాగా.. ఈ నెల 1న 193 నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే ఈ నెల 4న కేసుల సంఖ్య 200 దాటడం గమనార్హం.
కర్ణాటకలోని నవోదయ విద్యాలయంలో 70 మందికి..
చిక్కమగళూరు, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లా ఎన్.ఆర్.పుర తాలూకా సీగోడులోని జవహర్ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం రేపింది. అక్కడ 63 మంది విద్యార్థులు సహా మొత్తం 70 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. బెంగళూరు సమీపం ఆనేకల్ తాలూకా మరసూరు గ్రామంలోని ఓ నర్సింగ్ కళాశాలలో పలువురికి కొవిడ్ సోకింది.
ఏపీలో కొత్తగా 154 మందికి..
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 154 మందికి కొవిడ్ నిర్ధారణైంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 30,979 నమూనాలు పరీక్షించగా.. అందులో 0.49 శాతం మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ కాలవ్యవధిలో కొవిడ్‌తో గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మరణించారు. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 20,57,156కు, మరణాలు 14,452కు చేరాయి.
బోడిగూడెంలో మరో 14 మందికి జ్వరాలు
కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామంలో 14 మందికి జ్వరాలున్నట్లు గుర్తించారు. స్థానిక జడ్పీ, మండల పరిషత్తు పాఠశాలలకు చెందిన నలుగురు బాలుర వరుస మరణాలతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో గ్రామంలో ఆదివారం కూడా వైద్యశిబిరం కొనసాగింది. విద్యార్థుల నుంచి రక్తనమూనాల సేకరణతోపాటు గ్రామంలో ఇంటింటా నిర్వహించిన సర్వేలో ఐదుగురు పిల్లలు, ఆరుగురు పెద్దలతో కలిపి 11మందికి జ్వరాలున్నట్లు గుర్తించారు. మరో ముగ్గురు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. డెంగీ, మలేరియా, గన్యా పరీక్షల నిమిత్తం 313 మంది నుంచి రక్తనమూనాలు సేకరించారు.