
ఆంధ్రప్రదేశ్
దిల్లీలో సీఎం నివాసం ఎదుట పంజాబ్ పీసీసీ చీఫ్ ఆందోళన
అతిథి ఉపాధ్యాయుల డిమాండ్‌కు మద్దతుగా బైఠాయింపు
కేజ్రీవాల్ ఇంటి ఎదుట ధర్నాలో కూర్చొన్న సిద్ధూ
దిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు పదునైన విమర్శలు, పోటాపోటీ ఆందోళనలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు పంజాబ్‌లో పర్యటించిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పలు రకాల హామీలు గుప్పిస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా మొహాలీలో గత నెల్లో ఒప్పంద ఉపాధ్యాయులు ఆందోళన చేయగా ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఆప్ ఆధికారంలోకి వస్తే ఒప్పంద ఉపాధ్యాయులు అందరి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. సరిగ్గా అదే రీతిలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ ఆదివారం కేజ్రీవాల్‌కు బదులిచ్చారు. ఈ మేరకు దిల్లీలోని అతిథి ఉపాధ్యాయుల ఆందోళనలో పాల్గొన్నారు. తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారమిక్కడి సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం ఎదుట ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనకు హాజరైన సిద్ధూ వారితో కలిసి బైఠాయించారు. దిల్లీ ప్రభుత్వం ఒప్పంద విద్యా విధానాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు.