
ఆంధ్రప్రదేశ్
శత జయంతి ఉత్సవంలో సాహితీవేత్తలు
మాట్లాడుతున్న కవి శివారెడ్డి, పక్కన సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్
గుంటూరు సాంస్కృతికం, న్యూస్టుడే: వందేళ్ల కిందటే సమాజంలోని లోపాలను గుర్తించి, ప్రశ్నించిన మాలపల్లి నవల.. తెలుగు సాహిత్యంలో ఉత్తమమైనదిగా నిలిచిందని సుప్రసిద్ధ కవి కె.శివారెడ్డి అన్నారు. రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ విప్లవ భావాలతో అందులోని పాత్రలను సృష్టించారని కొనియాడారు. గుంటూరు బ్రాడీపేట 2/7లోని జాషువా విజ్ఞాన కేంద్రంలో సాహిత్య అకాడమీ, అమరావతి సామాజిక అధ్యయన సంస్థ సంయుక్త నిర్వహణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా మాలపల్లి నవల శతజయంతి ఉత్సవం ఆదివారం నిర్వహించారు. ప్రారంభ సమావేశానికి శివారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. నాటి కుల, మత, ఆర్థిక అసమానతలను మాలపల్లి నవల సృజనాత్మకంగా తెలియజేసిందని కొనియాడారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు అకాడమీ సాహిత్య కృషిని, మాలపల్లి నవల విశేషాలను వివరించారు. అమరావతి సామాజిక అధ్యయన సంస్థ వ్యవస్థాపకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాలపల్లి నవల నేపథ్యాన్ని విశదీకరించారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ మాలపల్లి నవల సర్వకాల ప్రాధాన్యం కల్గిందని, అందులో ప్రస్తావించిన సంఘటనలు, సామాజిక అంశాలు, ఈనాటికీ కనిపిస్తుండటం దాని సజీవత్వానికి నిదర్శనమన్నారు. తర్వాత జరిగిన మూడు సమావేశాల్లో పలువురు రచయితలు, సాహితీవేత్తలు నవలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ప్రజాకవి గోరటి వెంకన్న ప్రసంగిస్తూ కుల, మత వివక్షకు వ్యతిరేకంగా రచయిత మాలపల్లి రచించారని వివరించారు.