
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయంతో పాటు సమానమైన ప్రాధాన్యమున్న పాడిరంగానికి అధికారులు కొరత తీవ్రంగా ఉంది. పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించి సకాలంలో వైద్యం అందించే కీలకమైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు గత ఏడాదిన్నరగా రెగ్యులర్ డైరెక్టరే లేరు. పలు పోస్టులకు ఇన్ఛార్జి అధికారులే దిక్కయ్యారు. రాష్ట్ర సంచాలకుడు(డైరెక్టర్), అదనపు సంచాలకుడు, సంయుక్త సంచాలకుడు, ఉప సంచాలకుడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా వరసగా నలుగురు ఉన్నతస్థాయి హోదా అధికారులు లేకపోవడంతో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ పరిపాలనంతా ఇన్ఛార్జుల చేతుల్లోనే సాగుతోంది. జిల్లాస్థాయి పశుసంవర్ధకశాఖ అధికారులూ 11 జిల్లాలకు లేరు. నారాయణపేట, ములుగు జిల్లాల్లో అయితే ఈ శాఖ తరఫున కనీసం ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. రాష్ట్రంలో మొత్తం 989 పశువైద్యుల పోస్టులుంటే వాటిలో 266 ఖాళీలే. మూగజీవాలకు రోగమొచ్చి వాటిని రైతులు తీసుకొస్తే వైద్యం చేసేందుకు అటెండర్లు, కాంపౌండర్లే దిక్కవుతున్నారు. పశువైద్యుల పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర పశువైద్య పట్టభద్రులు పలుమార్లు ప్రభుత్వానికి, ఈ శాఖకు విన్నవించినా పట్టించుకునేవారే లేరు. మరోవైపు రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోంది. సాధారణంగా శీతాకాలంలో మార్కెట్కు అధికంగా పాలు రావాలి. కానీ, రాష్ట్రంలో పాల కొరత వల్ల నిత్యం కర్ణాటక డెయిరీ నుంచి తెలంగాణ విజయ డెయిరీ కొంటోంది. క్షేత్రస్థాయిలో పశువైద్యుల కొరతకు తోడు విజయ డెయిరీకి సైతం పూర్తిస్థాయి పాలనాధికారి లేరు. విజయ డెయిరీలో కొంతకాలంగా పాలనా వ్యవహారాలు కుంటుపడటంతో పాలను కర్ణాటక నుంచి కొనాల్సి వస్తోందని ఓ అధికారి ‘ఈనాడు’కు చెప్పారు.