
గ్రేటర్ హైదరాబాద్
మహా ధర్నాలో నినాదాలు చేస్తున్న ఆర్.కృష్ణయ్య, నేతలు, విద్యార్థులు
కవాడిగూడ, న్యూస్టుడే: పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ధర్నాచౌక్లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు బోధన రుసుములు చెల్లించాలని, ఉపకార వేతనాలు, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని కోరారు. ధర్నాలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్, తెలంగాణ బీసీ నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.