
గ్రేటర్ హైదరాబాద్
విచారణకు ఆదేశించిన పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి
‘ఈనాడు’ కథనానికి స్పందన
కార్పొరేషన్(వరంగల్), న్యూస్‌టుడే: వరంగల్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో ఏం జరుగుతోంది? కప్పం కట్టించుకుంటున్న కార్పొరేటర్లు ఎవరో విచారణ చేపట్టాలని రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్.. గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్యను కోరారు. ‘కార్పొరేటర్లకు కప్పం’ శీర్షికన ఆదివారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. కార్పొరేటర్ల వసూళ్లపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సిటీ ప్లానర్ వెంకన్నను కమిషనర్ ఆదేశించారు. ఈ కథనంతో ఇంకొంతమంది బాధితులు గళం విప్పారు. కాజీపేట ప్రాంతంలో ఓ భవన నిర్మాణంలో మామూళ్ల కోసం ఇద్దరు కార్పొరేటర్లు జులుం ప్రదర్శించినట్లు తెలిసింది. వరంగల్ ప్రాంతంలో మరో ఇద్దరు కార్పొరేటర్లపై ఫిర్యాదులు వచ్చాయి. టీఎస్-బీపాస్ ద్వారా భవన నిర్మాణాలకు అనుమతి పొందినా... కార్పొరేటర్లు తమవద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. వరంగల్ మహా నగరపాలక సంస్థలో కొందరు కార్పొరేటర్లపై సామాజిక కార్యకర్తలు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విటర్లో ఫిర్యాదు చేశారు.