Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
సాంకేతికత అండగా విమానయానం

వేగంగా విస్తరిస్తున్న రంగం

కొవిడ్‌ వల్ల 20 నెలలుగా కుదేలైన అంతర్జాతీయ పౌర విమానయాన రంగం మళ్ళీ తేరుకొంటోందన్న ఆశలు చిగురిస్తున్న సమయంలోనే- ఒమిక్రాన్‌ రకం వైరస్‌ వచ్చిపడింది. అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు విమాన ప్రయాణాలపై తిరిగి ఆంక్షలు విధిస్తున్నాయి. డిసెంబరు 15 నుంచి అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణాలకు పచ్చజెండా ఊపాలని తలచిన భారత్‌ సైతం పునరాలోచనలో పడింది. ఈ అనిశ్చిత పరిస్థితుల మధ్య ‘విమానయాన అభివృద్ధికి నవీకరణ మద్దతు’ అనే నినాదంతో డిసెంబరు ఏడున జరిగే అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం అదనపు ప్రాముఖ్యం సంతరించుకుంది. సామాజిక, ఆర్థికాభివృద్ధికి అంతర్జాతీయ విమానయానరంగం ఎలా తోడ్పడుతోందో ప్రజలందరికీ అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి అనుబంధ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) గణాంకాల ప్రకారం విమానయాన రంగం ప్రపంచ   జీడీపీకి 3.5శాతం వాటాను (2.7 లక్షల కోట్ల డాలర్లను) సమకూరుస్తోంది. ప్రపంచమంతటా 6.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది.

రెట్టింపే లక్ష్యం

ప్రస్తుత కొవిడ్‌ కాలంలోనే కాకుండా, భవిష్యత్తులోనూ విమానయాన రంగ పురోగతికి సాంకేతిక నవీకరణలు గొప్ప ఊతమివ్వనున్నాయి. ఇప్పటికే సాంకేతికత సాయంతో విమానాలు, వాటి ఇంజిన్లలో తేలికైన లోహాలను వాడుతూ ఇంధనాన్ని ఆదా చేయగలుగుతున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి విద్యుత్తు విమానాలను; విద్యుత్తు, సంప్రదాయ ఇంధనాల మిశ్రమంతో నడిచే హైబ్రిడ్‌ విమానాలను రూపొందించడానికి కృషి జరుగుతోంది. సరకులు, ప్రయాణికుల రవాణాకు స్వయంచాలిత విమానాలూ రేపోమాపో రంగప్రవేశం చేయవచ్చు. విమానయానంలో కృత్రిమ మేధ(ఏఐ), రోబోటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ), బిగ్‌ డేటా వంటి సాంకేతికతల వినియోగం ఇతోధికమవుతోంది. ఉదాహరణకు 2022 మార్చి నుంచి విజయవాడ, వారణాసి, కోల్‌కతా, పుణే విమానాశ్రయాలలో ముఖ గుర్తింపు(ఫేషియల్‌ రికగ్నిషన్‌) సాంకేతికత అమలులోకి రానున్నది. దీనివల్ల ప్రయాణికులు బోర్డింగ్‌ పాస్‌ లేకుండా ముఖాన్ని గుర్తించే సాంకేతికతతో విమానాలు ఎక్కగలుగుతారు. దీన్ని దశలవారీగా దేశంలోని ఇతర విమానాశ్రయాలకూ వర్తింపజేస్తారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్‌ వ్యాప్తి నిరోధక నిబంధనలను సక్రమంగా అమలు చేయడానికి ఐఓటీ, ఏఐల సాయంతో క్యూ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విమానయాన రంగంలో సరకుల రవాణాకే ఎక్కువగా అధునాతన సాంకేతికతలను వినియోగిస్తున్నప్పటికీ పోనుపోను ప్రయాణికుల రవాణాకూ అవి ఊతమివ్వనున్నాయి. 2050కల్లా ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులమంది నగరాల్లోనే నివసిస్తారు కాబట్టి విమాన ప్రయాణాలు మరింత విస్తరిస్తాయని ఐక్యరాజ్య సమితి అంచనా. 2030 సుస్థిరాభివృద్ధి అజెండాకు విమానయానం సమర్థంగా తోడ్పడుతుందని ఐరాస ఆశిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా జనసాంద్రత అధికంగా ఉండే నగరాల్లోనే విమానాశ్రయాలు నిర్మితమయ్యాయి. అవి నెలకొన్న ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి ఊపందుకొంటోంది. ప్రపంచ జనాభాలో 51శాతం- అంతర్జాతీయ విమానాశ్రయాలకు 100 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారు. అన్ని రకాల విమానాశ్రయాల పరిధిలో 74శాతం నివాసం ఉంటున్నారని ఐసీఏఓ వెల్లడించింది. 2036కల్లా ప్రయాణికులు, సరకుల రవాణాను రెట్టింపు చేయాలని విమానయాన పరిశ్రమ లక్షిస్తోంది. తద్వారా పైలట్లు, ఇంజినీర్లు, విమాన ప్రయాణ నియంత్రణ సిబ్బంది అవసరం పెరిగి యువతకు ఉపాధి లభిస్తుంది. భారత ప్రభుత్వం వాణిజ్య పైలట్ల శిక్షణ కోసం అయిదు విమానాశ్రయాల సమీపంలో ఎనిమిది శిక్షణ సంస్థలను నెలకొల్పనున్నట్లు ఈ ఏడాది జులైలో ప్రకటించింది. 2020లో ప్రపంచమంతటా రోజుకు లక్ష విమాన ప్రయాణాలు జరిగాయని, 2030కల్లా ఇది రెండు లక్షల ప్రయాణాలకు పెరుగుతుందని ఐసీఏఓ అంచనావేస్తోంది. 2017లో ప్రపంచ విమానయాన సంస్థలు 410 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయని, 5.6 కోట్ల టన్నుల సరకులను రవాణా చేశాయని పేర్కొంది. 2036కల్లా విమానయాన రంగం నేరుగా 1.55 కోట్ల అదనపు ఉద్యోగాలను సృష్టిస్తుందని, ప్రపంచ జీడీపీకి అదనంగా 1.5 లక్షల కోట్ల డాలర్లను సమకూరుస్తుందని ఐసీఏఓ ఊహిస్తోంది. కొవిడ్‌ వల్ల ఈ లక్ష్యాన్ని అందుకోవడం కాస్త ఆలస్యం కావచ్చునేమోగానీ, ఆ దిశగా పురోగతి మాత్రం ఆగదు.

పెట్టుబడుల ప్రవాహం

భారత్‌లో 2020లో 153 విమానాశ్రయాలు ఉండగా, 2040కల్లా వాటి సంఖ్యను 190-200కు పెంచాలని ప్రభుత్వం తలపెట్టింది. 2027నాటికి భారత విమానయాన సంస్థల వద్ద 1,100 విమానాలు ఉండబోతున్నాయి. రానున్న నాలుగేళ్లలో భారత విమానయాన రంగంలోకి  రూ.35,000 కోట్ల కొత్త పెట్టుబడులు ప్రవహించబోతున్నాయి. 2026కల్లా విమానాశ్రయాల్లో మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం రూ.13,500 కోట్ల పెట్టుబడులు సమకూర్చబోతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అస్సాం, అండమాన్‌ నికోబార్‌, గుజరాత్‌, లక్షదీవుల్లో 14 జల విమానాశ్రయాల నిర్మాణంపై రూ.450 కోట్లు వెచ్చిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో 28 సముద్ర విమాన రూట్లూ అంతర్భాగంగా ఉన్నాయి. ప్రపంచంలో స్వదేశీ విమాన ప్రయాణికుల సంఖ్యలో అమెరికా, చైనాల తరవాతి స్థానాన్ని భారతదేశం ఇప్పటికే ఆక్రమించింది. 2021లో జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 11.6 కోట్లకు చేరింది. 2024నాటికి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాల మార్కెట్‌లో బ్రిటన్‌ను అధిగమించనుంది.  విమానయానంలో దినదిన ప్రవర్ధమానమవుతున్న ఇండియాకు 2038నాటికి 2,380 వాణిజ్య విమానాలు అవసరపడతాయి. ఆ మేరకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి.

ముందున్నది మంచి కాలమే

ఒమిక్రాన్‌ వల్ల అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కొంతకాలం విఘాతం కలిగే మాట నిజమేకానీ, స్వదేశంలో విమాన ప్రయాణాలు యథావిధిగా కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత జనాభాలో అత్యధికులకు టీకాలు వేయడం, అధునాతన సాంకేతికతలను ఉపయోగించి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం అందుకు తోడ్పడనున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌ వల్ల భారత విమానయాన సంస్థలకు రూ.19,000 కోట్లు, విమానాశ్రయాలకు రూ.3,400 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వెల్లడించింది. అక్టోబరులో ఎయిరిండియా సంస్థను టాటా సన్స్‌కు విక్రయించడం, తరవాత జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ, స్టాక్‌ మార్కెట్‌ ఉద్దండుడు రాకేశ్‌  ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ’ అనే కొత్త విమాన సంస్థను ప్రారంభించడం వంటి పరిణామాలు- భారత విమానయాన పరిశ్రమ భవిష్యత్తు దివ్యంగా ఉండబోతోందనే ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. ఏది ఏమైనా- ఒమిక్రాన్‌ ప్రభావం తాత్కాలికమేనని, 2022 మొదటి త్రైమాసికానికల్లా విమాన ప్రయాణాలు కొవిడ్‌ ముందునాళ్ల స్థాయిని అందుకొంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

- వరప్రసాద్‌


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.