
ఫీచర్ పేజీలు
ఉదయం నిద్ర లేవగానే దవడలు నొప్పి పుడుతున్నాయా? ఇది నిద్రలో పళ్లు కొరుకుతున్నారనటానికి సంకేతం కావొచ్చు. దీన్ని ఇలాగే వదిలేస్తే మున్ముందు పళ్లు దెబ్బతినొచ్చు. దంతాలు పగిలిపోవచ్చు, వదులవ్వచ్చు, ఊడిపోవచ్చు. దవడ సమస్యలకూ దారితీయొచ్చు. కాబట్టి పళ్లు కొరుకుతున్నట్టు అనిపిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
* మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ప్రశాంతతను కలిగించే యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి సాధన చేయాలి.
* కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకోవాలి. రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకోవాలి. నిద్ర సమస్యలుంటే తక్షణం చికిత్స తీసుకోవాలి.
* దవడ నొప్పిగా ఉంటే ఐస్ లేదా వేడి కాపడం పెట్టాలి.
* గట్టిగా ఉండే పదార్థాలు తినటం మానెయ్యాలి. బబుల్ గమ్ వంటివి నమలొద్దు.
* రోజంతా ముఖం, దవడ కండరాలు వదులుగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి.
* క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించాలి. దీంతో పళ్లు నూరటం వల్ల దంతాలు దెబ్బతింటుంటే ముందే పట్టుకోవచ్చు.