
క్రీడలు
మాడ్రిడ్: రష్యా సాధించింది. 15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ముచ్చటగా మూడోసారి డేవిస్ కప్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రీడల్లో తమ దేశంపై డోపింగ్ నిషేధం కొనసాగుతుండడంతో రష్యా టెన్నిస్ సమాఖ్య (ఆర్టీఎఫ్) పేరుతో ఈ టోర్నీలో పోటీపడ్డ ఆ జట్టు ఫైనల్లో 2-0 తేడాతో క్రొయేషియాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో రుబ్లెవ్ 6-4, 7-6 (7-5)తో బోర్నా గోజోపై గెలిచి ఆర్‌టీఎఫ్‌కు శుభారంభాన్ని అందించాడు. ఇక రెండో సింగిల్స్‌లో జోరు మీదున్న మెద్వెదెవ్ 7-6 (9-7), 6-2తో సిలిచ్‌ను ఓడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రెండు సింగిల్స్ మ్యాచ్‌లను రష్యానే గెలవడంతో డబుల్స్ పోరు అవసరం లేకుండా పోయింది. డేవిస్ కప్‌లో వరుస సెట్లలో గెలవడం మెద్వెదెవ్కిది అయిదో సారి. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి అతనికి గట్టి పోటీ ఎదురైంది. సిలిచ్ పోరాడటంతో మ్యాచ్ పోటాపోటీగా సాగింది. కానీ టైబ్రేకర్‌లో మెద్వెదెవ్కే విజయం దక్కింది. ఇక రెండో సెట్లో అతను పూర్తిగా చెలరేగి ప్రత్యర్థిని చిత్తుచేశాడు. 2006 తర్వాత రష్యాకిదే తొలి డేవిస్ కప్ టైటిల్. ఆ జట్టు 2002లోనూ విజేతగా నిలిచింది.
సొంతగడ్డపై డెన్మార్క్‌తో: 2019 ఫిబ్రవరి తర్వాత తొలిసారి స్వదేశంలో భారత్ డేవిస్ కప్ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ గ్రూప్-1 పోరులో భాగంగా వచ్చే ఏడాది మార్చిలో డెన్మార్క్‌తో తలపడుతుంది. డేవిస్ కప్‌లో తమ గత మూడు మ్యాచ్‌ల కోసం భారత్ విదేశాలకే వెళ్లింది. డెన్మార్క్ సింగిల్స్ ఆటగాడు హోల్గర్ ర్యాంకు (103) మన ఆటగాళ్ల కంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ ఆ జట్టుతో పోరు మనకే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. చివరగా 1984లో ఈ రెండు జట్లు పోటీపడగా భారత్ 3-2తో గెలిచింది.