
క్రీడలు
ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలవడం తన అదృష్టమని అజాజ్ అన్నాడు. ముంబయిలోనే పుట్టిన అతను తన చిన్నతనంలో కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వలస వెళ్లిన సంగతి తెలిసిందే. ‘‘ఇదెంతో ప్రత్యేకమైన ప్రదర్శన. వాంఖడేకు వచ్చి ఆడడమన్నది ఓ కల. అలాంటిది 10 వికెట్ల ప్రదర్శన చేయడం నాతో పాటు నా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ విషయంలో నేను అదృష్టవంతుణ్ని. సుదీర్ఘ కాలం పాటు సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేయడంతో ఇది సాధ్యమైంది. ఓ స్పిన్నర్‌గా కొన్నిసార్లు తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మూడు రోజుల్లో 70కి పైగా ఓవర్లు వేశా. సహకరిస్తున్న పిచ్‌పై నిలకడగా బంతులేయడం ముఖ్యం. భారత ఆటగాళ్లు స్పిన్‌ను సమర్థంగా ఆడతారని తెలుసు. వాళ్లు నాపై ఒత్తిడి తెచ్చారు. అందుకే ప్రతి బంతినీ కట్టుదిట్టంగా వేశా. ఒకవేళ నేను వెనకబడితే నాపై ఆధిపత్యం చలాయిస్తారని తెలుసు. అందుకే కాస్త బుర్ర పెట్టి ఆడా. కివీస్‌లో అందరిలాగే నేనూ మొదట పేసర్ అవ్వాలనుకున్నా. కానీ నా ఎత్తు తక్కువ కావడంతో స్పిన్‌ను ఎంచుకున్నా. అశ్విన్ బౌలింగ్‌ను చూడడం గొప్పగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిస్థితుల్లోనూ అతను వికెట్లు తీశాడు’’ అని మ్యాచ్ ముగిశాక అశ్విన్‌తో మాట్లాడుతూ అజాజ్ చెప్పాడు. అతణ్ని అశ్విన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘‘భారత్‌కు చెందిన ఓ మధ్య తరగతి కుటుంబం కివీస్‌కు వలస వెళ్లడం. అక్కడ అతని తండ్రి ఓ వర్క్‌షాప్ పెట్టుకోవడం. ఇప్పుడు అజాజ్ ఈ స్థాయికి చేరుకోవడం. ఇదో అద్భుతమైన ప్రయాణం. అతను గొప్ప ప్రదర్శన చేశాడు. వాంఖడేలో ప్రతిసారి బంతి తిరగదు. కానీ అతను సీమ్‌ను ఉపయోగించుకుని సరైన ప్రదేశాల్లో బంతులేశాడు. అతని బౌలింగ్‌ను ఎంతో ఆస్వాదించా. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నా. ఇప్పటివరకూ అక్కడ టెస్టు సిరీస్ నెగ్గలేదు. ఈ సారి అది సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.