తెలంగాణ

Facebook Share Twitter Share Comments Telegram Share
India-Russia Summit: భారత్‌... బాహుబలి

కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచిన మా మిత్రదేశం
కొనియాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌
మీ దేశం మాకు నమ్మదగిన భాగస్వామి...
శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్య
6 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి ఒప్పందం
మున్ముందూ బంధం కొనసాగుతుందన్న పుతిన్‌

దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

దిల్లీ: భారత్‌ బలమైన శక్తి అని, కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచిన తమ మిత్రదేశమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కొనియాడారు. ఉభయ దేశాల మధ్య బంధాలు మరింత బలపడుతున్నాయని, భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు. భారత్‌-రష్యా 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశం నిమిత్తం సోమవారం భారత్‌ విచ్చేసిన ఆయన... దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు. అంతకుముందు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌లు... రష్యా రక్షణమంత్రి జనరల్‌ సెర్గీ షోయిగు, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌లతో ద్వైపాక్షిక, 2+2 సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉభయ దేశాలు నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అమేఠీ (యూపీ)లోని ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో 6,01,427 ఏకే-203 రైఫిళ్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి.

ఈ బంధం స్థిరమైనది: మోదీ

ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా... భారత్‌, రష్యా సంబంధాలు స్థిరంగా, దృఢంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌కు రష్యా నమ్మదగిన భాగస్వామి అని, ఉభయ దేశాల మధ్య సహకారం మున్ముందూ కొనసాగుతుందని ఆకాంక్షించారు. శిఖరాగ్ర సమావేశం నిమిత్తం దిల్లీ చేరుకున్న పుతిన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. భారత్‌తో బంధానికి రష్యా ప్రాధాన్యమిస్తోందని, కొవిడ్‌ సమయంలో పుతిన్‌ పర్యటించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ‘‘ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ భారత్‌-రష్యా స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. వ్యూహాత్మక, ప్రత్యేక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోంది’’ అని మోదీ పేర్కొన్నారు. అఫ్గాన్‌ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్‌... ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా భారత్‌తో కలిసి పోరాడతామని చెప్పారు.

28 అంశాల్లో అంగీకారం...

మోదీ, పుతిన్‌ల భేటీలో ప్రస్తావనకు వచ్చిన పలు అంశాలను విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా వెల్లడించారు. ‘‘తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభన సహా భారత్‌కు సంబంధించిన రక్షణ సవాళ్లన్నీ నేతల మధ్య చర్చకు వచ్చాయి. అఫ్గానిస్థాన్‌ విషయంలో ఇరు దేశాలు సన్నిహిత సంప్రదింపులు, సమన్వయం కొనసాగించాలని నేతలిద్దరూ నిర్ణయించారు. అఫ్గాన్‌ భూభాగం ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వరాదని, ఉగ్రవాద చర్యలకు ఉపయోగపడకూడదని అభిప్రాయపడ్డారు. సీమాంతర ఉగ్రవాదంపై పోరాడాలని, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని భావించారు. ఇంధన రంగంలో వ్యూహాత్మక సహకారంపైనా చర్చించారు. రెండు దేశాల మధ్య మొత్తం 28 ఒప్పందాలు కుదిరాయి’’ అని ఆయన వివరించారు.

డ్రాగన్‌ సైనికీకరణకు పాల్పడుతోంది...

తమ పొరుగుదేశం విపరీత సైనికీకరణకు, ఆయుధ విస్తరణకు పాల్పడుతోందనీ... భారత్‌ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగకపోయినా, ఉత్తర సరిహద్దు ప్రాంతంలో డ్రాగన్‌ దూకుడుగా వ్యవహరిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మండిపడ్డారు. రాజకీయ సంకల్ప బలంతో, ప్రజల స్వాభావిక సామర్థ్యంతో వీటిని అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌-రష్యాల ‘రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 చర్చల’ సందర్భంగా రాజ్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, చైనా పేరును మాత్రం ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌, రక్షణ మంత్రి జనరల్‌ సెర్గీ షోయిగులు పాల్గొన్నారు. భారత్‌-రష్యాలది అద్వితీయ బంధమనీ... ఇది స్థిరంగా, అసాధారణంగా కొనసాగుతోందనీ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు. లావ్రోవ్‌తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు.


అమెరికా అడ్డుకున్నా వెనక్కు తగ్గలేదు: లావ్రోవ్‌

వార్షిక సదస్సులో భారత్‌, రష్యా రక్షణ శాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జనరల్‌ సెర్గీ షోయిగు

భారత్‌-రష్యా మధ్య కుదిరిన ‘ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందం’ భారత రక్షణ సామర్థ్యానికి ఎంతో ముఖ్యమని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ పేర్కొన్నారు. తమ సహకారానికి తూట్లు పొడిచేందుకు అమెరికా ప్రయత్నించినా, ఈ ఒప్పందం ముందుకు సాగుతోందన్నారు. సుమారు రూ.37,675 కోట్ల (5 బిలియన్‌ డాలర్ల) విలువైన ఐదు యూనిట్ల ఎస్‌-400లను సమకూర్చుకునేందుకు 2018లో భారత్‌ ఒప్పందం కుదుర్చుకొంది. ఈ విషయంలో ముందుకెళ్తే ఆంక్షలు విధిస్తామని నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించినా భారత్‌ మాత్రం వెనక్కు తగ్గలేదు.

ఒప్పందాలపై సంతకాలు

రాజ్‌నాథ్‌, షోయిగుల ఆధ్వర్యాన ‘రక్షణ, రక్షణ-సాంకేతిక సహకారంపై భారత్‌-రష్యాల అంతర్‌ ప్రభుత్వ కమిషన్‌ (ఐఆర్‌ఐసీజీ-ఎం అండ్‌ ఎంటీసీ) 20వ సమావేశం జరిగింది. సైనిక పరికరాల ఉమ్మడి ఉత్పత్తిని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకోవడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఉభయ దేశాలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

భారత సైనిక దళాల నిమిత్తం రూ.5 వేల కోట్లతో అమేఠీలోని ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో 6,01,427 ఏకే-203 రైఫిళ్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయడం.

కలష్నికోవ్‌ సీరీస్‌ చిన్నపాటి ఆయుధాల తయారీకి సంబంధించిన 2019 నాటి ఒప్పందానికి సవరణ.

సైనిక సహకారాన్ని మరో పదేళ్లు కొనసాగించడం.

‘ఐఆర్‌ఐసీజీ-ఎం అండ్‌ ఎంటీసీ’  సమావేశ నియమ నిబంధనలకు అంగీకారం.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.