
ఆంధ్రప్రదేశ్
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ
ఆలస్యంగా నివాళులర్పించిన ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు
ఈనాడు, దిల్లీ: అంబేడ్కర్ వర్ధంతి రోజున దిల్లీలోని ఏపీ, తెలంగాణభవన్లలో ఆయన విగ్రహానికి అధికారులు పూలమాలలు వేయకపోవడం, నివాళులర్పించనందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండు భవనాల అధికారులు పూలమాలలు వేయలేదు. విషయం తెలుసుకున్న కృష్ణమాదిగ విగ్రహం వద్దకు వచ్చి నివాళులర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విగ్రహానికి పూలదండ వేయకపోవడంపై అధికారులను ప్రశ్నిస్తే రాష్ట్రాల నుంచి ఆదేశాలు రాలేదంటున్నారన్నారు. ఒకవేళ అదే నిజమైతే బాధ్యులైన రెండు రాష్ట్రాల సాంఘిక సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇచ్చినా ఇక్కడ పాటించకపోతే రెండు భవన్ల రెసిడెంట్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనాసక్సేనా నివాళులర్పించారు.