
తెలంగాణ
చర్యల ఉపసంహరణకు విపక్షాల పట్టు
దిల్లీ: ప్రతిపక్షానికి చెందిన 12 మంది ఎంపీలను పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసేవరకు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ విపక్ష సభ్యులు సోమవారం సయితం ఎగువసభను స్తంభింపజేశారు. సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నాగాలాండ్ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయడం వంటివి మినహా సభలో కార్యకలాపాలు కొనసాగలేదు. దీంతో సభ స్వల్ప విరామాలతో నాలుగుసార్లు, అనంతరం మంగళవారానికి వాయిదా పడింది. కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలకు చెందిన సభ్యులు పలుమార్లు నిరసనలు తెలిపారు. అమిత్‌షా ప్రకటన చేస్తున్నప్పుడూ వారు సభాపతి స్థానం వద్ద బైఠాయించి, నినాదాలు కొనసాగించారు. ద్రవ్యోల్బణం, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం లభించినప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ- ముందుగా సస్పెన్షన్లు ఎత్తివేసి, ఆ ఎంపీలనూ చర్చలో పాల్గొనేందుకు అనుమతించాలన్నారు. 12 మందిని సస్పెండ్ చేసి, చర్చను ప్రారంభించడం ‘‘ప్రజాస్వామ్యంలో నేరం’’ అని వ్యాఖ్యానించారు. ధరలపై చర్చ జరగాలని కోరి, తీరా అవకాశమిస్తే చర్చించకపోవడమేమిటని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ప్రశ్నించారు. విపక్ష పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలే ధరల పెరుగుదలకు కారణమని గోయల్ ఆరోపించారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే భాజపా పాలిత రాష్ట్రాలు దానికి అదనంగా వ్యాట్‌నూ తగ్గించాయని గుర్తుచేశారు.
సంసద్ టీవీ కార్యక్రమానికి థరూర్ దూరం
సస్పెన్షన్లను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనలు తెలియజేస్తున్నవారికి వివిధ విపక్ష నేతలు సంఘీభావంగా నిలిచారు. ఖర్గే సహా పలువురు నేతలు వారితో పాటు శిబిరంలో నినాదాలిచ్చారు. మరోపక్క- ఈ సస్పెన్షన్లు ఎత్తివేసే వరకు సంసద్ టీవీలో ‘టు ద పాయింట్’ టాక్‌షోలో తాను పాల్గొనబోనని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తెలిపారు.