
జాతీయ- అంతర్జాతీయ
కేరళ హైకోర్టులో ఓ మహిళ వ్యాజ్యం
తమ ప్రయత్న లోపం లేదన్న కేంద్రం
కోచి: భారతదేశం తరఫున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఆబుదాబీలో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న కేరళ యువకుడి విడుదలకు చేయవలసినదంతా చేసినా ఉపయోగం లేకపోయిందని కేంద్ర ప్రభుత్వం కేరళ హైకోర్టుకు తెలిపింది. 2015 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న షిహానీ మీరా సాహిబ్ జమాల్ మహమ్మద్ విడుదల కోసం అతని తల్లి షాహుబనత్ బీవి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిని యూఏఈ అధికారులు చిత్రహింసలు పెట్టారని, అతడిని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం లేదా యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు. కేంద్రం తన కుమారుడికి యూఏఈలో న్యాయ సహాయమూ అందించలేదని వాపోయారు. ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. తమ నుంచి ప్రయత్నలోపం లేదని సోమవారం స్పష్టంచేసింది. జమాల్ మహమ్మద్‌కు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయాల్సిందిగా యూఏఈలోని బారత రాయబార కార్యాలయం అక్కడి ప్రభుత్వాన్ని అభ్యర్థించిందని తెలిపింది. అయితే, ఇది తమ జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి భారత్ విన్నపాన్ని మన్నించలేమని యూఏఈ ప్రభుత్వం తేల్చిచెప్పిందని పేర్కొంది. ఇక తాము చేయగలిగిందేమీ లేనందున కేసును మూసివేయాల్సిందిగా హైకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. దీంతో జమాల్ మహమ్మద్ 2025లోనే విడుదల అవనున్నారు.