
తెలంగాణ
102 మంది మిల్లర్ల నుంచి అపరాధ రుసుం..
వసూలు చేయాలంటూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: బియ్యం ఎగవేతదారులపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. 2019-20 రబీ సీజనులో ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని బియ్యం ఎగనామం పెట్టిన వారి నుంచి బియ్యం విలువ, వడ్డీతో కూడిన అపరాధ రుసుమును వసూలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. గడువు ముగిసినప్పటికీ లక్ష మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 102 మంది మిల్లర్లు పక్కదారి పట్టించారు. ఈ అంశంపై ‘ఈనాడు’లో పలు కథనాలు రావడంతో స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. కొన్ని మిల్లుల్లో వారికి కేటాయించిన ధాన్యానికి సంబంధించి బియ్యం నిల్వలు లేకపోవటాన్ని గుర్తించారు. మరికొన్ని మిల్లుల్లో నిల్వలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ అంశంపై గత కొన్ని నెలల అనంతరం.. తనిఖీల నాటికి నిల్వలులేని మిల్లుల నుంచి ఒక్కో మెట్రిక్ టన్ను బియ్యం ధరకు రూ.31 వేల చొప్పున, దీనిపై 25 శాతంతో పాటు.. ఈ మొత్తం సొమ్ముపై ఏడాదికి 12% వడ్డీని వసూలు చేయాలని నిర్ణయిస్తూ పౌరసరఫరాలశాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిల్వలు ఉన్నప్పటికీ గడువులోగా ఇవ్వని వారినుంచి బియ్యం ధరతో పాటు 25% విలువ చేసే మొత్తాన్ని అపరాధ రుసుముగా వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బియ్యం తీసుకోవడంలో జాప్యం కేంద్రానిదే: శ్రీనివాస్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ‘బియ్యం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వమే జాప్యం చేస్తోందని... రాష్ట్రంలోని ఎఫ్‌సీఐ గోదాముల వద్ద వందల లారీలు వేచి ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రవాణాకు వీలుగా గతేడాది 1,476 రవాణా రైళ్లను ఏర్పాటు చేస్తే ఈ దఫా ఇప్పటివరకు 1,096 ఏర్పాటు చేసిందని విమర్శించారు. సోమవారం పౌరసరఫరాల భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు.