
జాతీయ- అంతర్జాతీయ
భారత్-రష్యా నిర్ణయం
దిల్లీ: మానవసహిత అంతరిక్ష యానం సహా రోదసి రంగంలో మరింతగా సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిశ్చయించాయి. అంతరిక్ష వాహక నౌకల నిర్మాణం, నిర్వహణలో సహకారానికి సంబంధించిన అంగీకార పత్రాలపై సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆధ్వర్యాన ఉభయ దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశం సోమవారం జరిగింది. అనంతరం ఉభయదేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘‘రష్యన్ స్టేట్ స్పేస్ కార్పొరేషన్ (రోస్కోస్మోస్), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మధ్య సహకారం పెంపొందించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. శాంతియుత ప్రయోజనాల నిమిత్తం బాహ్య ప్రపంచాన్ని వినియోగించుకోవాలని, పరస్పర ప్రయోజనాల నిమిత్తం లాంచ్ వెహికల్స్ అభివృద్ధిలో సహకరించుకోవాలని అంగీకరించాం. మానవసహిత అంతరిక్షయానం విషయంలో ఉమ్మడి కార్యక్రమాల్లో జరుగుతున్న పురోగతిని ఉభయ పక్షాలు ఆహ్వానించాయి. గగనయాన్ కార్యక్రమంలో భాగంగా నలుగురు భారత అంతరిక్ష యాత్రికులు రష్యాలో శిక్షణ పొందారు. ఇది మున్ముందూ కొనసాగుతుంది. కుడంకుళంలో అణు విద్యుత్ కర్మాగారంలో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయి’’ అని పేర్కొన్నాయి.