
గ్రేటర్ హైదరాబాద్
కొత్త షెడ్యూల్ ఖరారుకు కమిటీ
ప్రాజెక్టు సాగునీటి పనులకు సవరించిన అంచనా వ్యయం రూ.35,950 కోట్లు
రాజ్యసభలో కేంద్రం వెల్లడి
ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం పనులు జరుగుతున్న స్థితిని బట్టి చూస్తే అప్పటిలోగా పూర్తయ్యేలా కనిపించడం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకే ప్రాజెక్టుకు కొత్త షెడ్యూల్‌ను సూచించడానికి 2021 నవంబర్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం రూ.35,950.16 కోట్లు అవుతుందని సవరించిన అంచనాల (రివైజ్డ్ కాస్ట్) కమిటీ 2020 మార్చిలో ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సిఫార్సుల తర్వాత దీనికి పెట్టుబడి అనుమతులు తీసుకోనున్నట్లు చెప్పింది. పోలవరం సవరించిన అంచనాలపై సోమవారం రాజ్యసభలో వైకాపా నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడూ ఈ మేరకు సమాధానమిచ్చారు. ‘2017-18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్ల పోలవరం సాగునీటి ప్రాజెక్టు రెండో సవరించిన అంచనాలకు 2019 ఫిబ్రవరిలో జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలోని ఇరిగేషన్, ఫ్లడ్‌ఫ్లో కంట్రోల్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అడ్వయిజరీ కమిటీ తన 141వ సమావేశంలో ఆమోదం తెలిపింది. తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2020 మార్చిలో నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం రూ.35,950.16 కోట్లు అవుతుందని వ్యయాన్ని విభజించింది. పీపీఏ సిఫార్సు తర్వాత దానికి పెట్టుబడుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2014 ఏప్రిల్ 1 నాటికి.. సాగునీటి విభాగం మిగిలిన భాగం నిర్మాణానికయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే నూరు శాతం సమకూర్చాల్సి ఉంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును బిల్లులు అందగానే పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సుల ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతితో ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నాం. 2014 ఏప్రిల్ 1 నుంచి రూ.11,600.16 కోట్లు చెల్లించాం. తర్వాత పీపీఏ, సీడబ్ల్యూసీలు రూ.711.60 కోట్ల చెల్లింపునకు సిఫార్సు చేశాయి’ అని బిశ్వేశ్వర్ తెలిపారు.