
ఆంధ్రప్రదేశ్
9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం
రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు బోర్డు లేఖ
ఈనాడు, హైదరాబాద్: సాగు, తాగునీటి అవసరాలపై చర్చించేందుకు ఈ నెల 9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే సోమవారం ఏపీ జలవనరుల శాఖ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లకు లేఖలు రాశారు. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైందిగా భావించే ధనుర్మాసం ఈ నెల 16న ప్రారంభం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 17 నుంచి నిర్వహించే సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ధనుర్మాస ఘడియలు 2022 జనవరి 14న ముగియనున్నాయి.
కర్నూలులో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఉత్తర్వు
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ట్రైబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు సోమవారం జీవో జారీ చేశారు. విజయవాడలో ఉన్న ట్రైబ్యునల్ కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రాన్ని విడుదల చేసింది.
నేటి నుంచి గుట్కా, పాన్‌మసాలా తయారీ, విక్రయాల నిషేధం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం నుంచి ఏడాది పాటు గుట్కా, పాన్‌మసాలా, నమిలే పొగాకు పదార్థాల తయారీ, పంపిణీ, విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార పరిరక్షణ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని ఓ ప్రకటన జారీ చేశారు.