
గ్రేటర్ హైదరాబాద్
రాష్ట్రంలోకి కొత్త వేరియంట్ ప్రవేశించలేదని ఆరోగ్య శాఖ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ టిమ్స్‌లో చికిత్స పొందుతున్న 13 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎవరికీ ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాలేదని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి మొత్తం 1,805 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిలో 13 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించగా.. ఒక్కరిలో కూడా ఒమిక్రాన్ లేదని తేలింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రాష్ట్రానికి 535 మంది అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోకి ఇప్పటి వరకు కొత్త వేరియంట్ ప్రవేశించలేదని స్పష్టం చేశారు.
కొత్తగా 195 కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 195 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,77,138కి పెరిగింది. మహమ్మారితో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 4000కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37,108 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 2,88,01,263కు పెరిగింది.
* కరీంనగర్ సమీపంలోని చల్మెడ వైద్య కళాశాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 50కి చేరింది. ఆదివారం 43 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కాగా మరో ఏడుగురు వైరస్ బారిన పడినట్లు తాజాగా గుర్తించారు.
కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ 15న
జియాగూడ, న్యూస్‌టుడే: కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఈ నెల 15న రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 63 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఈ చెక్కులు అందజేస్తామని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదే రోజు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.