
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, అమరావతి: భారీ వర్షాలకు గత నెల 18న కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కట్టలు కొట్టుకుపోయిన ఘటనపై అధ్యయనానికి కేంద్రం నిపుణుల కమిటీని పంపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో డ్యాం కట్టలు తెగిపోయి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. ప్రాజెక్టు స్పిల్ వేకు ప్రమాదం జరిగిందని సాక్షాత్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్ రాజ్యసభలో ప్రకటించారు. ఇంతవరకు స్పిల్ వే ధ్వంసమైన సమాచారం ఏదీ జల వనరులశాఖ నుంచి లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి ఒక నివేదిక కేంద్ర జలసంఘం చెన్నై కార్యాలయం నుంచి కేంద్రానికి చేరినట్లు తెలిసింది.త్వరలోనే ఈ బృందం కడప జిల్లాకు వచ్చి సమగ్ర అధ్యయనం చేయనుంది.
అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు
ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: పింఛ, అన్నమయ్య జలాశయాల మట్టికట్టలు తెగిపోవడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలను నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి, సాంకేతిక ఉప కమిటీలను నియమించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులిచ్చింది. హైపవర్ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఛైర్మన్‌గా, జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి, రెవెన్యూ ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ఈఎన్సీలను సభ్యులుగా నియమించారు.