
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, అమరావతి: ప్రభుత్వోద్యోగులకు సంబంధించి పీఆర్సీ సహా మొత్తం 71 సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతిలు మంగళవారం నుంచి తలపెట్టిన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులందరం పాల్గొంటామని ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగం ఎంప్లాయిస్ యూనియన్ (ఏపీపీటీడీ ఈయూ) ప్రకటించింది. ఈ మేరకు ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను కమిషనర్‌కు అందజేసింది. ఈయూ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావులు ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
* ఈ ఉద్యమాన్ని వ్యవసాయ విస్తరణాధికారులు విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వేణుమాధవరావు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకూ అందరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.
* అలాగే ట్రెజరీ ఉద్యోగులు అందరూ పాల్గొనాలని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోషియేషన్ పేరిట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.కిరణ్‌కుమార్, అధ్యక్షుడు శోభన్‌బాబు పిలుపునిచ్చారు.
నిరసనల్లో పాల్గొనవద్దు... ఉద్యోగ సంఘాల ఐకాస తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోషియేషన్‌కు సంబంధించిన మరో వర్గం ప్రతినిధులు జి.రవికుమార్, రమణారెడ్డి మరో ప్రకటన జారీ చేశారు.
* మేం పాల్గొనబోవడం లేదని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం అధ్యక్షుడు ఏవీ పటేల్ ప్రకటించారు. ఉద్యోగులు, అధికారుల సంక్షేమానికి సంబంధించి సీఎం జగన్‌పై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరానికి పూర్తి విశ్వాసం ఉందన్నారు.