
తెలంగాణ
భాజపా, తెరాసల ఒప్పందంతోనే వారం రోజుల హడావుడి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
ఈనాడు, దిల్లీ: ధాన్యం కల్లాల్లో గుండెలు పగిలి చోటుచేసుకున్న రైతుల మరణాలన్నీ మోదీ, కేసీఆర్ ప్రభుత్వాల హత్యలేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రైతుల కుటుంబాలకు రూ.పదిలక్షల చొప్పున పరిహారం చెల్లించడంతోపాటు తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని క్వింటా రూ.1,960 చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై 3నెలలుగా రైతులకు మద్దతుగా కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో పోరాడుతోందన్నారు. తెరాస ఎంపీలు మాత్రం సెంట్రల్ హాల్లో ఫొటోలు దిగి పార్లమెంట్లో నిరసన చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల కోసం దిల్లీపై యుద్ధం చేస్తానన్న కేసీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
వరంగల్‌లోని ఎఫ్‌సీఐ గోదాంను తనిఖీ చేసినప్పుడు 25 వేల టన్నుల బియ్యం లెక్కల్లో తేడా వచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో చెప్పారని, ఒక్క గోదాంలోనే అంత తేడా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మాయమయ్యాయోనని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై సీబీఐ విచారణకు భాజపా ప్రభుత్వం ఎందుకు ఆదేశించడం లేదని అడిగారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్‌కు ఆదేశాలు..
పార్లమెంట్లో నిరసనలు నిలిపివేయాలని కేంద్రం నుంచి సీఎం కేసీఆర్‌కు ఆదేశాలు వెళ్లాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ ఆదేశాల మేరకు తెరాస ఎంపీలు మంగళవారం కొద్దిసేపు ఆందోళన చేసి హైదరాబాద్ వెళతారన్నారు. భాజపా, తెరాస ఒప్పందంలో భాగంగానే వారం రోజులపాటు హడావుడి చేశారన్నారు. తెరాస, భాజపా ఒక్కటేనని.. ఇద్దరూ కలిసి ధాన్యం కొనుగోళ్లు జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పసుపు, ధాన్యం సమస్యలపై దిల్లీలోని జంతర్‌మంతర్‌లో త్వరలోనే కాంగ్రెస్ నేతృత్వంలో ఆందోళన చేస్తామని రేవంత్ చెప్పారు.
రైస్ మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కు: కోదండరెడ్డి
గాంధీభవన్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కైందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో కిసాన్కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కలెక్టర్లు, మంత్రులు కలిసి రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు వరి ధాన్యం అమ్మేలా చేశారన్నారు. మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని అన్వేష్‌రెడ్డి విమర్శించారు. నాలుగేళ్ల నుంచి ఇప్పటి వరకు ఎఫ్‌సీఐ కొనుగోలు చేసిన ధాన్యం లెక్కలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.