
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: నీటి వనరుల్లో రొయ్య పిల్లల పంపిణీ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు, నల్గొండ జిల్లా కొండ భీమనపల్లి చెరువులో విడుదల చేసిన రొయ్య పిల్లల నాణ్యత, లెక్కల్లో నిబంధనలు పాటించలేదని వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. విచారణ కోసం మత్స్యశాఖ అదనపు సంచాలకుడి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆ శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.