
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, దిల్లీ: హైదరాబాద్ సహా దేశంలో మరో ఆరుచోట్ల ఉన్న ‘ఔషధ విద్య, పరిశోధన జాతీయ సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, నైపర్)లకు జాతీయ ప్రాధాన్య హోదా కల్పించే బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. జాబితాలో అహ్మదాబాద్, గువాహటి, హాజీపుర్, కోల్‌కతా, రాయ్‌బరేలిలోని నైపర్లు కూడా ఉన్నాయి. ఇదివరకు పంజాబ్ మొహాలీలో ఏర్పాటుచేసిన సంస్థకు 1998లో జాతీయ ప్రాధాన్యహోదా ఇచ్చారు. తర్వాత ఇప్పుడే మరో ఆరు సంస్థలకు ఆ హోదా కల్పించారు. ఈ బిల్లు చట్టరూపం సంతరించుకున్న తర్వాత ఈ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి దక్కుతుంది. ఫలితంగా అవి సొంతంగా పరీక్షలు నిర్వహించడంతోపాటు, డిగ్రీలు, డిప్లొమాలు, ఇతర హోదాలు ప్రదానం చేయడానికి అధికారం ఉంటుంది. వీటికి కేంద్రం నుంచి నిధులు అందుతాయి. ఈ సంస్థల మధ్య కార్యకలాపాల సమన్వయంకోసం ఓ జాతీయస్థాయి కౌన్సిల్ ఏర్పాటుకూ ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. సంస్థ కార్యకలాపాల నియంత్రణ, నిర్వహణకోసం పాలకమండలి ఏర్పాటుకూ బిల్లు అవకాశం ఇచ్చింది. ఇందులో 23 వరకు ఉన్న సభ్యుల సంఖ్యను తాజాగా 12కు తగ్గించారు. ఈ బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నైపర్ తెలంగాణకు వెళ్లినందున ఏపీకి ప్రత్యేక సంస్థను కేటాయించాలని కోరారు.