
గ్రేటర్ హైదరాబాద్
ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు చోటు
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో కలిపి కేంద్ర ప్రభుత్వం సదర్ రీజినల్ పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు కేంద్ర విద్యుత్తుశాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 2(55) కింద దక్షిణాదిలో విద్యుత్తు వ్యవస్థ సమీకృత నిర్వహణ కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో కేంద్ర విద్యుత్తు కంపెనీలు, సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ, కేంద్ర ప్రభుత్వ ట్రాన్స్మిషన్ కంపెనీ, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్లకు చెందిన ఒక్కో ప్రతినిధి సభ్యుడిగా ఉంటారు. రాష్ట్రాల నుంచి ఇదే తరహా సంస్థల ప్రతినిధులూ ఇందులో సభ్యులుగా కొనసాగుతారు. రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వరంగ డిస్కంలలో రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన సంస్థ ప్రతినిధి, ప్రైవేట్ డిస్కంల నుంచి అయితే అక్షరక్రమంలో వరుసగా ఒక్కో సంస్థ ప్రతినిధి రొటేషన్ పద్ధతిలో ఇందులో సభ్యుడిగా కొనసాగుతారు. ఈ కమిటీ దిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. గ్రిడ్ పనితీరును మెరుగుపరచడానికి ప్రాంతీయ స్థాయి విద్యుత్తు నిర్వహణను విశ్లేషిస్తుంది. ఈ కమిటీ నెలకోసారి సమావేశమవుతుంది. దీని పరిధిలో సబ్కమిటీలు, టాస్క్ఫోర్సులు, అడ్హాక్ కమిటీలు, స్టాండింగ్ కమిటీలు అవసరమైనప్పుడు సమావేశమవుతుంటాయి.