
తెలంగాణ
ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు
విజయనగరం, పాతశ్రీకాకుళం, కడప గ్రామీణ, న్యూస్టుడే: ‘ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, పీఆర్సీపై కాలయాపన చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేకే రోడ్డున పడ్డాం. పోరుబాట పట్టాం...’ అని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 7 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు అందరూ దశలవారీ ఉద్యమానికి సిద్ధమయ్యామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకుంటే రెండోదశ ఉద్యమ కార్యాచరణ తెలియజేస్తామని చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘నేను ఉద్యోగుల పక్షపాతిని. ఏ రాజకీయపార్టీకీ తొత్తును కాదు. రూ.16వేల కోట్ల ఆర్థికపరమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాం. తిరుపతి పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎవరో ఉద్యోగి అడిగితే ప్రకటన చేశారే తప్ప.. దాని విధివిధానాలపై ఎవరికీ స్పష్టత ఇవ్వలేదు. కనీసం పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని కోరుతున్నా స్పందించడం లేదు. ఉద్యోగులకు డీఏ బకాయిలున్నాయి. రెండేళ్లుగా సుమారు రూ.750 కోట్ల మేర ఏపీజీఎల్ఐ బాండ్లు మెచ్యూరైనా ఇవ్వడం లేదు. జీపీఎఫ్ బిల్లులు దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ ఉన్నాయి...’ అని వివరించారు.
ప్రభుత్వం మీద నమ్మకం లేకనే...
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను ఏపీ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం లేకనే రోడ్డుమీదకి రావాల్సి వచ్చిందని ఏపీ ఉద్యోగ ఐకాస(అమరావతి) ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కడపలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.