
సినిమా
ఇంటర్నెట్ డెస్క్: ‘భీమ్లా నాయక్’ వాయిదా విషయంపై ఇప్పటికే పలుమార్లు స్పందించిన చిత్ర బృందం తాజాగా మరోసారి స్పష్టతనిచ్చింది. పవన్ కల్యాణ్, రానా కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రమిది. సాగర్ కె. చంద్ర దర్శకుడు. ఈ సినిమాని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. అయితే, అదే సీజన్లో మరికొన్ని భారీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకొస్తుండటంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయంటూ గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. సదరు వార్తలపై స్పందించిన మూవీ టీమ్ ‘అనుకున్న రోజునే విడుదల చేస్తాం’ అని క్లారిటీ ఇచ్చింది. ‘ఈ సినిమా సంక్రాంతికి లేనట్టే’ అనే కథనాలు నెట్టింట మళ్లీ దర్శనమిస్తుండటంతో చిత్ర బృందం మరోసారి స్పష్టతనిచ్చింది. ‘‘భీమ్లా నాయక్’.. 2022 జనవరి 12న మీ ముందుకొస్తుంది’ అని తెలిపింది.
మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ రూపొందుతోంది. నిత్యా మేనన్, సంయుక్త మేనన్ కథానాయికలు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
► Read latest Cinema News and Telugu News