తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Brahmanandam: మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించడానికే..

తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ హాస్యబ్రహ్మగా మారిన నటుడు.. బ్రహ్మానందం. ఆయన ఇటీవల ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు. రెండు భాగాలుగా జరిగిన ఇంటర్వ్యూలో తొలి భాగం గతవారం ప్రసారం కాగా.. కొనసాగింపుగా జరిగిన ఇంటర్వ్యూ రెండో భాగంలో ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..

ఇంతలా నవ్వించే మీరు.. ఎప్పుడైనా నవ్వులపాలయ్యారా?

బ్రహ్మానందం: ఎవరికైనా నవ్వులపాలవడం సాధారణ విషయమే. ఎవరైనా తాను నవ్వులపాలు కాలేదు అంటే అది అబద్ధం. దుర్యోధనుడంతటి వాడే నవ్వులపాలయ్యాడు మనమెంత..? 

సమాజానికి ఇంత చేస్తున్నాం.. అయినా మన మీద బురదజల్లుతున్నారు అని ఎప్పుడైనా బాధ పడ్డారా?

బ్రహ్మానందం: సమాజానికి మనం ఏమీ చేయట్లేదు. మన కోసం మనం చేస్తున్నాం. అయితే, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఒకరికి బురదజల్లడం లక్షణమైతే.. బురదజల్లించుకునే స్థితికి రావడం ఇంకొకరి లక్షణం. ఓ పది, పదిహేను మంది ఉన్న చోట ఇవన్నీ మామూలే. 

కల్యాణ మండపం కట్టించారు.. అది సమాజం కోసం కట్టించలేదా?

బ్రహ్మానందం: కాదు. నేను ఇది చేశాను.. అని చెప్పుకోవడం నాకు మొదటి నుంచి నచ్చదు. నేను చేశాను అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ.. చేయించుకున్నవాడికి ‘నేను వాడి చేత చేయించుకున్నాను’ అని చెప్పుకోవాల్సిన స్థితి కలగకూడదు. అదే నమ్ముతాను. అందుకే చెప్పుకోవడం ఇష్టం లేదు.

ఒకప్పుడు విడుదలయ్యే ప్రతి సినిమాలో మీరు కనిపించేవారు. ఈ మధ్య కాలంలో మీ జోరు ఎందుకు తగ్గింది?

బ్రహ్మానందం: బ్రహ్మానందం ఎందుకులే అని వారు(దర్శకులను ఉద్దేశించి) అనుకోవచ్చు. లేదా ఎందుకులే అని నేనే అనుకొని ఉండొచ్చు. మరో విషయం ఏంటంటే.. రెండేళ్ల కిందట నాకు హార్ట్‌ బైపాస్‌ సర్జరీ జరిగింది. దీంతో ఇంట్లోవాళ్లు ‘కష్టపడింది చాలు.. ఇక సినిమాలు చేయొద్దు’ అని చెప్పారు. ప్రస్తుతం ఐదారు సినిమాలు చేస్తున్నా. ‘బీమ్లా నాయక్‌’, ‘రంగమార్తాండ’, ‘కలవారి కోడళ్లు’, నితిన్‌ సినిమాలో నటిస్తున్నా. జోరు తగ్గడం.. పెరగడం అనేది మన చేతుల్లో ఉండదు. ‘ఈ మధ్య బ్రహ్మానందంతో మాట్లాడుతుంటే కామెడీ ఉండట్లేదు.. అంతా వేదాంతం చెప్పేస్తున్నాడు’అని అంటుంటారు. కామెడీ, వేదాంతం, నిజం వేర్వేరు కాదు.. అంతా ఒక్కటే.

బ్రహ్మానందాన్ని పెట్టుకుంటే సమయానికి రాడు.. ఆయన అనుకున్న సమయానికే వస్తాడు. సాయంత్రం 5గంటలకే వెళ్లిపోతాడు అని అంటుంటారు. వాళ్లకు మీ సమాధానం?

బ్రహ్మానందం: వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, నేను ఒక్కటే చెప్తున్నా. నేను పడ్డంత శ్రమ ఎవరూ పడలేదు. 38ఏళ్లలో 1,254 సినిమాలు చేశా. నా సినిమాలకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. ఓ వేదికపై శ్యామ్‌ బెనగల్‌ గారితో ‘నేను ఇప్పటికి 800 సినిమాల్లో నటించాను’ అని అంటే.. రాత్రీపగలు పనిచేశారా అని అడిగారు. మేం అప్పుడు రోజుకు 18గంటలు చేశాం. ఇప్పుడున్న కమెడియన్లు చేసి ఉండరు. ఊహ తెలిసినప్పటి నుంచి, ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తూనే ఉన్నా. నా కెరీర్‌ చివర్లో అయినా కాస్త సుఖపడాలనుకుంటున్నాను. నాకంటూ కొంత టైం కేటాయించుకోవాలి. ఉదయాన్నే హడావుడి చేయడానికి వయసు సహకరించాలి కదా! ఈ మధ్య ఓ వీడియో బైట్‌ ఇచ్చా ‘తెలంగాణ దేవుడు’ సినిమా చూడండని చెప్పడానికి. అయితే, అదే సమయంలో ‘రంగమార్తాండ’ సినిమాలో ఒక పాత్ర కోసం గడ్డం పెంచుకున్నా. అది చూసి చాలా మంది నాకు ఆరోగ్యం బాగోలేదనుకొని ఆరా తీస్తూ కామెంట్లు పెట్టారు. ఇవాళ్టికీ నన్ను ప్రేక్షకదేవుళ్లు అభిమానిస్తూ.. ఆదరిస్తున్నారు కాబట్టి ఇంకా సినిమాలు చేస్తాను.. కానీ నాక్కూడా కొంచెం విశ్రాంతి ఇవ్వండని కోరుకుంటున్నా అంతే. 

వయసులో ఉన్నప్పుడు రాత్రి.. పగలు కష్టపడ్డాం. సమయం, పని అందరికి దొరకదు. నువ్వు(ఆలీని ఉద్దేశించి), నేను గొప్పవాళ్లమని కాదు.. మనకంటే గొప్పవాళ్లు కృష్ణానగర్‌, గణపతి కాంప్లెక్స్‌లో చాలా మంది ఉన్నారు. వాళ్లందరికి అవకాశాలు రాలేదు.. పనులు దొరకలేదు. పని దొరకలేదని చాలా మంది బాధపడుతున్నారు. పని దొరికినప్పుడు దాన్ని గౌరవంగా చేసుకోవాలి. ఒక వయసుకు వచ్చాక.. పిల్లల కోసం కష్టపడాలి గానీ.. మన కోసం మనం కష్టపడకూడదు. 

ప్రపంచమంతా మిమ్మల్ని చూసి నవ్వుతుంది.. మరి నిన్ను నవ్వించేవాళ్లు ఎవరు?

బ్రహ్మానందం: నా మనవడు పార్థ. వాడు మాములోడు కాదు. ‘తాత.. నీకు తెలియదు నువ్వు ఊరుకో’ అంటూ విసుక్కుంటుంటే నవ్వొస్తుంది. కరెక్టుగా నాకు మనవడితో ఆడుకునే వయసు రాగానే పుట్టాడు. 

గౌతమ్‌ ఉదయం మీ వద్దకు వచ్చి ‘నాన్న.. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను’ అని చెప్పగానే.. సాయంత్రం ఇంటికొచ్చి ఓకే.. పది రోజుల్లో పెళ్లి చేసేద్దాం అని చెప్పారట. అంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ఏంటి?

బ్రహ్మానందం: అందరూ అదే అడుగుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ‘నాన్న.. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను’ అన్నాడు. అదేదో ‘మర్డర్‌ చేశాను నాన్న.. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్‌’అని అడుగుతున్నాడా? ప్రేమించాను అంటే తప్పేలా అవుతుంది. పైగా టీనేజీ కుర్రాడు కాదు.. బాగా చదువుకున్నాడు. అమ్మాయిని చూశాడు.. ప్రేమించాను అన్నాడు. ప్రేమించాను అంటే.. ఐదారేళ్లు ఆలోచించాలా? ఏం అక్కర్లేదు. వాడికి అమ్మాయి ఇష్టం. అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఒప్పుకోవడం తండ్రి కనీస బాధ్యత. ఈ మధ్య కాలంలో ప్రేమించడం.. అమ్మాయిల్ని ప్రేమించలేదని చంపేయడం ఇలాంటివి టీవీల్లో చూస్తున్నాం. ప్రేమ అనేది చావు లేనిది. కుదరకపోతే వదిలేయాలి. కానీ.. దానికి కక్ష పెంచుకోవడం సరికాదు. 

ఒక సమయంలో బ్రహ్మానందం చేసిన పాత్రలన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఒకేలా చేస్తున్నారు అన్న మాటలు వినిపించినప్పుడు ఏమనిపించింది?

బ్రహ్మానందం: నేను దర్శకత్వం వహించట్లేదు.. సినిమా తీయట్లేదు.. పాత్రలు సృష్టించట్లేదు. ఈ మూడు పనులు ముగ్గురు వేర్వేరు వ్యక్తులు చేస్తున్నారు. ఓ నిర్మాత ఒక సినిమా చేస్తున్నాడు అనుకుందాం.. దర్శకుడు తనకు బ్రహ్మానందం కావాలంటారు.. బ్రహ్మానందం పాత్రను రచయితతో రాయిస్తారు. నేను ఆ పాత్ర గతంలోనే చేశా.. ఇప్పుడు నేను చేయను అంటే.. అవకాశాలే ఉండవు. కాబట్టి.. మన దగ్గర నుంచి వాళ్లు ఏం కావాలనుకుంటున్నారో అది ఇవ్వాలి. కామెడీ ఒకే టైపులో ఉంది అంటే ఎలా? రెండో టైపు కామెడీ చేయగలమని మనం నిరూపించుకోవాలి. ‘మనీ’ సినిమాలో నా పాత్ర గతంలో నేను చేసిన కామెడీకి భిన్నంగా ఉంటుంది. ‘ఖాన్‌ దాదా’గా ఆహార్యం, నడక, మాట పూర్తిగా వేరు. నాలో ఆ కోణాన్ని శివనాగేశ్వరరావు చూడగలిగారు. రామ్‌ గోపాల్‌ వర్మ, శివనాగేశ్వరరావు కలిసి నేను ఇలా బాగుంటానని ఆలోచించి చేశారు. ఆ టైపు పాత్రలను ఎవరైనా చూసి చేయగలితే బాగుంటుంది. తాజాగా రంగమార్తాండ సినిమాలో నాది తెల్ల గడ్డంతో స్టేజ్‌ ఆర్టిస్ట్‌ పాత్ర.. ప్రకాశ్‌రాజ్‌కి స్నేహితుడిగా చేస్తున్నా. అది చేస్తున్నప్పుడు ఈ పాత్ర చేస్తానని దర్శకుడు ఎలా అనుకున్నారు అని అనడానికి లేదు. వాళ్లు ఏది ఇచ్చి చేయమంటే అది చేస్తాం.

ఒక ఆర్టిస్టు డైలాగు చెప్పగలడు.. కమెడియన్లు కామెడీ చేస్తారు. కానీ.. మంత్రాలు చదవడం చాలా కష్టం. మీకెలా వచ్చింది?

బ్రహ్మానందం: నేను డీఎన్‌ఆర్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు.. అక్కడ ఓ పంతులు ఉండేవారు. ఆయన మేం ఉంటున్న ఇంటికి వచ్చి మంత్రాలు చదివేవారు. అప్పట్లో నేను మిమిక్రీ చేసేవాడిని. దీంతో ఆ పంతులు చెప్పే విధానాన్ని పట్టుకొని.. పురోహితులు ఎలా మాట్లాడుతారో అది అలవాటు చేసుకున్నా. అది ఎందుకు వచ్చిందో.. ఇంద్ర సినిమా చేసేటప్పుడు తెలిసింది. ఏదీ మనం నేర్చుకుంటే వచ్చేది కాదు. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నాకేం మంత్రాలు రావు.

హీరోగా ఎన్ని సినిమాల్లో నటించారు?

బ్రహ్మానందం: హీరో అని కాదు.. ఆ రోజుల్లో ఏది దొరికితే అది చేసేవాడిని. అలా ‘బాబాయి హోటల్‌’, ‘సరసాల సోగ్గాడు’, ‘సూపర్‌ హీరోస్‌’, ‘పెళ్లామా మజాకా’ సినిమాలు చేశా. 

అప్పటి కమెడియన్లు.. ఇప్పటి కమెడియన్లపై మీ అభిప్రాయం ఏంటి?

బ్రహ్మానందం: కస్తూరి శివరావు, రేలంగి గారు నాకు తెలియదు. కానీ, వాళ్ల గురించి చదువుకున్నాను.  శివరావుకి నాగేశ్వరరావు కంటే ఎక్కువ ఇమేజ్‌ ఉంది. చావర్లెట్‌ కారులో వెళ్లేవారట. ఆ తర్వాత రేలంగి గారు చివర్లో అనారోగ్యంగా ఉన్నా కామెడీ చేశారు. అనేక మంది పాత కమెడియన్లలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఇప్పుడు ఉన్న వారు కూడా ఎవరి శైలిలో వారు నవ్విస్తున్నారు. తమ తమ శైలిలో నటించగల ఇంత మంది హాస్యనటుల చరిత్ర ఒక్క తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఉంది. రాజబాబులాంటి చురుకైనా హాస్యనటుడు మరొకరు లేరు. ఎక్కువ కాలం లేకపోయినా.. ఎంతో మంచి మానవత్వం ఉన్న వ్యక్తి. 

ఇప్పుడున్న కమెడియన్లలో ఎవరంటే ఇష్టం?

బ్రహ్మానందం: ఇప్పుడున్న కమెడీయన్లలో ఎవరి శైలి వారిది. అయితే, ఎమ్మెస్‌ నారాయణ కేవలం హాస్యనటుడే కాదు.. బాగా చదువుకున్న వ్యక్తి. ఒకసారి నేను, ఎల్బీ శ్రీరాం, తను కలిసి నటిస్తున్నాం. ఒక ఇంట్లో షూటింగ్‌ జరుగుతుంది. ఇంట్లోని మెట్లపై షాట్‌ పెట్టారు. ఎల్బీ శ్రీరాం మాట్లాడుతూ.. ‘బ్రహ్మానందం గారు.. నాకు ఇలాంటి మెట్లపై కూర్చొని పేపర్‌ చదువుతూ కాఫీ తాగాలని ఉంటుంది’ అన్నారు. వెంటనే ‘మీ ఇంట్లో మెట్లపై కూర్చొని తాగండి’అని ఎమ్మెస్ అన్నారు. దానికి ఆయన ‘మా ఇంటి దగ్గర అన్ని ఫ్లాట్స్‌ అండీ.. మెట్లు లేవు’ అన్నారు. ‘అయితే ఓ పని చేయండి.. పొద్దున్నే పేపర్‌ పట్టుకొని ఇక్కడికి రండి.. కాఫీ తాగి మళ్లీ మీ ఇంటికి వెళ్లండి’’అని ఎమ్మెస్‌ అన్నారు. ఇలాంటి వందల జోకులు వేసేవారు. 'అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు బాగా చదువుకున్నావ్​. గొప్పవాడివి. ఓ కమెడియన్​ నీలాగా ఉండాలి. అది నా కోరిక' అని నాతో ఎప్పుడూ అనేవారు.

ఎమ్మెస్‌ చనిపోయే రోజు కిమ్స్‌ ఆస్పత్రిలో ఉన్నారు. అతడు గంటలో చనిపోతాడు అనగా.. తన కుమార్తెను అడిగి పెన్ను, పేపర్‌ తీసుకొని.. దానిపై ‘బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది’ అని రాశారట. అది నాకు తెలియదు. అప్పుడు నేను శంషాబాద్‌లో ‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రం షూటింగ్‌లో ఉన్నా. ఎమ్మెస్‌ కుమార్తె నాకు ఫోన్‌ చేసి ‘నాన్న మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు.. ఆయన ఆరోగ్యం బాగాలేదు’అని చెప్పారు. వెంటనే షూటింగ్‌లో అనుమతి తీసుకొని ఆస్పత్రికి వచ్చేశా. నన్ను అలా చూసి.. చేయి గట్టిగా పట్టుకొని.. అన్నయ్య అన్నాడు.. ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు.. కానీ నాకు అర్థం కాలేదు. వాళ్ల అబ్బాయిని పిలిపించి తన వంక.. నా వంక చూస్తూ ఉన్నాడు. నా వల్ల కాక నేను బయటకు వచ్చేశా. అలా బయటకొచ్చిన 15-20నిమిషాలకే చనిపోయాడు. 

ఇప్పుడున్న కమెడియన్లలో ఎవరి టైమింగ్‌ అంటే ఇష్టం?

బ్రహ్మానందం: ఇప్పుడు.. ఒక లక్ష మంది కమెడియన్లు ఉన్నట్లు ఉన్నారు. చాలా మందే ఉన్నారు.. ఉండాలి. ఎందుకంటే ఒక కుటుంబం బాగా పెద్దదయితే అంతకన్నా ఆనందం ఏముంది? నువ్వు(ఆలీని ఉద్దేశించి) అన్నా.. నీ కామెడీ అన్నా నాకిష్టం. అయితే, ఆలీ డబుల్‌ మీనింగ్‌ డైలాగులు మాట్లాడతాడు.. మహిళలను కించపరుస్తాడంటూ వచ్చిన కామెంట్లు నన్ను బాధపెట్టాయి నువ్వేంటో నాకు తెలుసు. అందరికీ తెలియదు.

ఏ కమెడియన్‌ అయినా తన సాధారణ ముఖాన్ని వికృతంగా.. అనేక భంగిమలు పెట్టి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తాడు. పొద్దున లేస్తే మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించడానికే. ఈ క్రమంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరగొచ్చు. దాన్ని టార్గెట్‌ చేసి ఇబ్బంది పెట్టడం సరికాదు. 

‘జప్ఫా’ అంటే ఏంటి?

బ్రహ్మానందం: అదేదో సినిమా షూటింగ్‌లో నాది ఇంగ్లిష్‌వాడి గెటప్‌. దర్శకుడు ఒకరిని తిట్టమన్నారు. ఎలా తిట్టాలని ఆలోచించి.. ‘వీడో పెద్ద జప్ఫాగాడిలా ఉన్నాడు’ అని అన్నాను. నోట్లో నుంచి ఎందుకొచ్చిందో తెలియదు. 

మీకు దేవుడితో పరిచయం ఉందా? దేవుడితో ఉన్న అనుభవాన్ని ఒక పుస్తకంగా రాస్తున్నారని విన్నాను?

బ్రహ్మానందం: ‘మై ఎక్స్‌పీరియన్సెస్‌ విత్‌ గాడ్’ పేరుతో పుస్తకం రాస్తున్నా. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి.. అలా ప్రయాణిస్తూ.. దిల్లీ రాష్ట్రపతి భవన్‌ దాక వెళ్లి పద్మశ్రీ అవార్డు తీసుకోగలిగాలను అంటే.. చాలా కష్టపడ్డాను.. స్వయం కృషి అంటారు. ఎవడికివాడు కష్టపడతాడు.. గొప్పవాడు అవ్వాలనే అనుకుంటాడు.కానీ, అందరూ గొప్పవాళ్లు అవ్వలేరు.. కష్టపడలేరు. ఇలాంటి స్థితిని కల్పించింది ఎవరు అని ఆలోచిస్తే.. ప్రతి సందర్భంలో నాకు కనిపించింది దేవుడే. దేవుడు అంటే.. రాముడా, కృష్ణుడా, అల్లానా.. జీససా అని కాదు. గాడ్‌ అంటే.. జీ అంటే జనరేటర్‌(సృష్టికర్త).. ఓ అంటే ఆపరేటర్‌(నడిపించేవాడు).. డీ అంటే డిస్ట్రాయర్‌(నశింపజేసేవాడు). సృష్టి.. స్థితి.. లయ కారకుడైన భగవంతుడే ఇవి మనకు కల్పించాడన్న ఆలోచన కలిగి పుస్తకం రాయడం మొదలుపెట్టా. నా జీవితంలో ఈ సంఘటనలు ఇలా జరిగాయని నేను అనుకోవడం కంటే పేపర్‌పై రాస్తే.. భవిష్యత్తులో దాన్ని ఎవరైనా చూసి ‘బ్రహ్మానందం అనేవాడు ఒకడుండేవాడు. వాడు ఇలా దేవుడిని నమ్ముకున్నాడు. మనం కూడా దేవుడిని నమ్ముకుందాం’ అనుకునేవాళ్లు ఒకరైనా పుట్టకపోతారా అని ఆ పుస్తకం రాస్తున్నా.

బ్రహ్మానందం శేషు ఎవరు?

బ్రహ్మానందం: అతడు నా శిష్యుడు. నా దగ్గర చదువుకున్నాడు. కొన్ని బంధాలు ఎలా ఏర్పడతాయో తెలియదు. 45 ఏళ్లు మేం కలిసి ప్రయాణిస్తామని అనుకోలేదు. నేనంటే తనకి చాలా ఇష్టం. తనంటే నాకూ ఇష్టం. కారణం తెలియదు. నేను ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వచ్చాక.. అతడు చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడని తెలిసి.. నా దగ్గరకి వచ్చేయ్‌ అన్నాను. అప్పటి నుంచి నాతోపాటే ఉంటున్నాడు.

Read latest Cinema News and Telugu News


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.