
సినిమా
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా నుంచి ఆంధ్రా వరకు ప్రస్తుతం థియేటర్లను షేక్ చేస్తున్న చిత్రం ‘అఖండ’. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపానికీ.. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుకు అభిమానులు బసవన్నల్లా రంకెలేస్తున్నారు. మరి బాలయ్య మరోసారి త్రిశూలం పడితే..? అఖండకు సీక్వెల్ వస్తే? సినీ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో ఇటీవల విడుదలైన చిత్రం అఖండ. విడుదలైన తొలి రోజు నుంచే సూపర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలుకొడుతోంది. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? ఫ్యాన్స్ మాత్రం కొనసాగింపు కావాల్సిందేనంటున్నారు.
సినిమా క్లైమాక్స్‌లో ‘ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి’ అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచుకొని వెళ్లిపోతాడు. కానీ వెళ్లేముందు సినిమాలో కీలకమైన మరో పాత్రైన మరో బాలకృష్ణ కూతురికి మాట ఇస్తాడు. ‘నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను’ అని చెబుతాడు. దీంతో సీక్వెల్‌ని తెరకెక్కిస్తే ఈ మాట ఆధారంగా పాపకు మరో సమస్య రావడం, అఖండ పునరాగమనం చేసే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. సినీ వర్గాల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది. మరి బాలయ్యే ఆదేశిస్తాడా? బోయపాటే ముందుకొస్తాడా మరో అఖండ జాతరకు ఎప్పుడు తెర లేస్తుందో వేచి చూడాల్సిందే..!
► Read latest Cinema News and Telugu News