Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share Comments Telegram Share
మౌనంగానే ఎదగమని..!

హేలాపురి సమీప అడవిలో.. ఓ చెట్టు మీద నుంచి రాలిపడిన విత్తనాలను, ఓ పక్షి ఒక్కొక్కటిగా ముక్కుతో పొడుచుకు తింటోంది. కాసేపట్లో.. ఆ పక్షి తనను కూడా తినేస్తుందని తెలిసిన ఓ గింజ.. గజగజా వణుకుతూ ఆ పక్షికి దొరక్కూడదని పక్కకి దొర్లుతూ దొర్లుతూ ఓ చిన్న గోతిలో పడిపోయింది.
‘హమ్మయ్యా..! పక్షి నోట్లో పడకుండా తప్పించుకున్నాను’ అనుకుని సంబరపడింది ఆ గింజ. అంతలో పెద్ద గాలి వీచింది. మట్టి ఎగిరి వచ్చి, గింజ దాక్కున్న గోతిలో పడి.. గొయ్యి పూడుకుపోయింది. ‘పక్షి నోట్లో పడి నలిగిపోకుండా తప్పించుకున్నానంటే ఈ గోతిలో సమాధి చేసేస్తున్నావా దేవుడా! ఊపిరాడక నాకిక చావు తప్పదు’ అని కుమిలిపోసాగిందా గింజ.
గాలితో పాటు కురిసిన వర్షం వల్ల ఆ గుంట నీటితో నిండిపోయింది. కొద్దిరోజుల తర్వాత గోతిలో పడిన ఆ విత్తనం మొలకెత్తింది. మట్టిని చీల్చుకుని బయటకి వచ్చి ఊపిరి పీల్చుకుంది. ‘హమ్మయ్యా! కొత్త జన్మ ఎత్తాను’ అని సంబరపడుతూ... ఆ చిగురు తొడిగిన చిన్ని మొక్క కొద్ది కొద్దిగా పెరగసాగింది.
బోలెడన్ని ఆకులతో మెల్లిగా ఊగుతూ ఆనందంగా, పచ్చగా పెరుగుతున్న ఆ చిన్ని మొక్క దగ్గరకి, ఒక చిన్న లేడిపిల్ల వచ్చింది. అది లేత ఆకుల్ని తినబోయింది. మొక్క భయంతో వణికిపోతోంది. ఇంతలో అటుగా వచ్చిన వేటగాడు, ఆ లేడిపిల్లపైకి బాణం వదిలాడు. ఆ శబ్దానికి ఉలిక్కి పడిన ఆ లేడిపిల్ల రివ్వున గెంతుతూ పారిపోయింది. ‘బతికానురా బాబూ..’ అనుకుంటూ ఆ మొక్క ఆకులు అల్లల్లాడిస్తూ ఆనందపడిపోయింది.
కొంతకాలానికి ఆ మొక్క మరి కాస్త పెరిగి, చిన్న చెట్టుగా ఎదిగింది. ఓ రోజు కట్టెలు కొట్టేవాడు అక్కడికి వచ్చాడు. ఆ చిన్న చెట్టును నరకడానికి గొడ్డలి పైకి ఎత్తాడు. అంతలో బుసకొడుతూ ఓ నాగుపాము కనిపించేసరికి, భయపడి అక్కణ్నుంచి పారిపోయాడు. అలా మరోసారి గండం నుంచి గట్టెక్కింది ఆ చెట్టు.
మరికొంత కాలానికి ఆ చెట్టు మరింత పెరిగి పెద్దదై.. అనేక కొమ్మలతో విస్తరించి పెద్ద వృక్షమై పోయింది. దానిపై అనేక పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. ఒకరోజు విత్తనంగా ఉన్నప్పుడు తనను తినడానికి ప్రయత్నించిన పక్షి కూడా ఆ చెట్టుపై గూడు కట్టుకోవడానికి వచ్చింది. ‘మిత్రమా! నేను విత్తనంగా ఉన్నప్పుడు, నీ నోటిలో చిక్కకుండా తప్పించుకున్నదాన్ని. ఈరోజు ఇలా పెద్ద వృక్షంగా పెరగడానికి ఆరోజు నువ్వు నన్ను తినకపోవడమే కారణం. చక్కగా నా కొమ్మ మీద గూడు కట్టుకుని హాయిగా ఉండు’ అంది స్నేహంగా ఆ చెట్టు.
ఆ పక్షి సంతోషంగా అక్కడే గూడు కట్టుకుంది. గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి ఆ చెట్టు మీదే శాశ్వతంగా ఉండిపోయింది.
మరొక రోజు ఎండవేళ.. ఆ చెట్టు కిందకు వచ్చిన లేడిని గుర్తు పట్టి, పలకరించింది.  ‘నీవు నన్ను మొక్కగా ఉన్నప్పుడు తినేసి ఉంటే.. ఇంత పెద్దగా ఎదిగి ఉండేదాన్ని కాదు. నీ ఇష్టం వచ్చినంతసేపు నా నీడలో సేద తీరు’ అని ఆ లేడితో చెప్పింది చెట్టు. సంతోషంగా ఆ లేడి ఎండ తగ్గే వరకూ.. చల్లని ఆ చెట్టు నీడలో సేద తీరింది. మరోసారి ఓ వ్యక్తిని సింహం తరుముకుంటూ రావడం చూసిందా చెట్టు. ఆ వ్యక్తి ఎవరో కాదు తనను వంటచెరకు కోసం నరకబోయిన కట్టెలు కొట్టేవాడే! సింహం బారినుంచి తప్పించుకోవడానికి వేగంగా పరిగెత్తి వచ్చి గబగబా చెట్టెక్కి, చిటారు కొమ్మకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు.
అప్పుడు చెట్టు అతనితో ‘మిత్రమా! నువ్వు కొంత కాలం క్రితం నన్ను నరికి వేయడానికి ప్రయత్నించావు గుర్తుందా? కానీ పాము కాటు భయంతో నన్ను నరకకుండా పారిపోయావు. ఆ రుణం ఈ విధంగా తీర్చుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పింది. తాను నరకబోయిన చెట్టే ఈరోజు తన ప్రాణాన్ని కాపాడిందని తెలుసుకున్నాడు ఆ వ్యక్తి. సింహం వెళ్లిపోయిన తర్వాత చెట్టు దిగి వచ్చి దానికి కృతజ్ఞతలు తెలియజేసి తన దారిని తాను వెళ్లిపోయాడు.
తనకు అపకారం చేయబోయిన వాళ్లకు కూడా ఉపకారం చేసిందా చెట్టు. అలాగే వేల మందికి తన ఫలాలతో ఆకలి తీర్చి, అలసి వచ్చిన వారిని తన నీడన సేద తీరనిచ్చి వందల సంవత్సరాలు జీవించింది.

- కోనే నాగ వెంకట ఆంజనేయులు


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.