
క్రీడలు
దిల్లీ: టీమ్ఇండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సహాయ బృందంలో సభ్యుడిగా కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ తొలి దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున కొన్ని మ్యాచ్‌ల్లో బరిలో దిగిన భజ్జీకి యూఏఈలో జరిగిన రెండో దఫా లీగ్‌లో అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో వచ్చేవారం పోటీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలని 41 ఏళ్ల భజ్జీ భావిస్తున్నాడు. ‘‘కన్సల్టెంట్ లేదా మెంటార్ లేదా సలహా బృందంలో సభ్యుడిగా భజ్జీ పాత్ర ఏదైనా అయ్యుండొచ్చు. అతని విశేష అనుభవాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఆటగాళ్ల వేలం సమయంలోనూ సదరు ఫ్రాంచైజీ తరఫున భజ్జీ కీలకంగా వ్యవహరించనున్నాడు’’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. గతంలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న సమయంలో వర్ధమాన ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడంపై భజ్జీ ఆసక్తి కనబరిచాడు.