
గ్రేటర్ హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లపై ప్రజాక్షేత్రంలో పోరాడతాం
స్పష్టం చేసిన తెరాస ఎంపీలు
పార్లమెంటు భవనం నుంచి బయటకు వస్తున్న తెరాస ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్ నేత, బి.బి.పాటిల్, సురేష్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, దయాకర్, లింగయ్య యాదవ్, మాలోత్ కవిత
ఈనాడు, దిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను తెరాస ఎంపీలు బహిష్కరించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల్లు, యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలంటూ ఉభయ సభల్లో చేసిన నిరసనలకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేశారు. క్షేత్రస్థాయి పోరాటాలతో ఈ సమస్యకు పరిష్కారం సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రధాని, కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ముందుగా ప్రకటించిన విధంగా నల్లచొక్కాలు ధరించిన తెరాస ఎంపీలు ఉభయ సభల్లో మంగళవారం కూడా ఆందోళనకు దిగారు. తెలంగాణ నుంచి పంట సేకరించకపోవడం, ఎఫ్‌సీఐ ధాన్యం తరలించకపోవడం, ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది టన్నుల వడ్లు మార్కెట్ యార్డుల్లో ఉండడం తదితర అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. తెలంగాణ సభ్యులతోపాటు ఇతర అంశాలపై పలు విపక్ష పార్టీల ఆందోళనతో అయిదు నిమిషాలకే రాజ్యసభ వాయిదా పడింది. మరోవైపు ఎమ్మెస్పీ చట్టం, జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానంపై చర్చించాలంటూ లోక్‌సభలో తెరాస పక్షనేత నామా నాగేశ్వరరావు నోటీసు ఇవ్వగా సభాపతి ఓం బిర్లా తిరస్కరించారు. నిరసనగా తెరాస సభ్యులు వెల్‌లో బైఠాయించి నినాదాలు చేశారు. సభాపతి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో, తెలంగాణ భవన్లో తెరాస ఎంపీలు విలేకరులతో మాట్లాడారు. పోరాడితేనే తెలంగాణ వచ్చిందని, అదే తీరున ధాన్యం సేకరణపైనా క్షేత్రస్థాయిలో పోరాడతామని కేశవరావు తెలిపారు. ప్రధాని మోదీని ప్రజాసామ్య వ్యతిరేకిగా అభివర్ణించిన ఆయన..తాము మోదీకి పూర్తివ్యతిరేకంగా ఉన్నామన్నారు. ‘‘ఇది ఫాసిస్ట్, ప్రజా, రైతు వ్యతిరేక, అహంకారపూరిత ప్రభుత్వం. నేటి నుంచి మా నినాదం మోదీని పంపించడమే(ఆజ్ సే హమారా నారా..మోదీ జారా)’’ అని కేకే స్పష్టంచేశారు. ‘ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తారా’ అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘ఆ ఆలోచన లేదని’ కేశవరావు బదులిచ్చారు.
నిరసనలు ఫలితమివ్వలేదు.. అందుకే బహిష్కరణ నిర్ణయం
ధాన్యం సేకరణే రాష్ట్రంలో అతిపెద్ద సమస్య. ఏళ్లుగా సాఫీగా సాగుతున్న ప్రక్రియను కొనసాగించాలని కోరాం. రాష్ట్రంలో మిగిలినపోయిన పారా బాయిల్డ్ రైస్ తీసుకోవాలని విన్నవించాం. గోదాములు నిండిపోయాయి. రైల్వే ర్యాక్‌లు ఇవ్వడం లేదు. సమస్యను వివరించినా వారికి అర్థం కావడం లేదు. పార్లమెంటులో ఎంతగా నిరసన తెలిపినా కేంద్రం పట్టించుకోలేదు. పంట కొనుగోలుపై మేం అడిగే ప్రశ్నపై కేంద్ర మంత్రి రూపాలాకు అవగాహన ఉంది. స్వతహాగా రైతు అయిన ఆయన ‘మీరు అడిగే దానిలో అర్థం ఉంది’ అని అన్నారు. మిగిలిన మంత్రులే అర్థం చేసుకోలేకున్నారు. ఇది పూర్తిగా రైతు, ప్రజా, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం. పార్లమెంటులో నిరసనలు ఫలించకపోవడంతో సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం. సమస్యను ప్రజలకు వివరిస్తాం
- కేశవరావు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత
రైతులను రోడ్లపై పడేసే కుట్ర
భాజపా నాయకులు తెలంగాణ రైతులను రోడ్లపై పడేసే కుట్రకు పాల్పడుతున్నారు. కేంద్ర మంత్రులు ఒక ప్రకటన చేస్తుంటే, భాజపా ఎంపీలు మరో ప్రకటన చేస్తున్నారు. రాష్ట్ర సమస్యపై సభలో మేం ఆందోళన చేస్తుంటే రాష్ట్రానికే చెందిన భాజపా, కాంగ్రెస్ ఎంపీలు కలిసి రావడం లేదు. పార్లమెంట్లో ఆ ఎంపీల వ్యవహార శైలిని ప్రజలు గుర్తించాలి. ధాన్యం సేకరణ అంశాన్ని పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశం, సభా కార్యకలాపాల కమిటీలోనూ లేవనెత్తాం. సభలు ప్రారంభమైనప్పట్నుంచి ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. యాసంగిలో వరి సాగుపై ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రశ్నకు సమాధానమిస్తే, యాసంగి పంట కొనమని వాణిజ్యశాఖ మంత్రి సమాధానమిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరగనందునే సమావేశాలు బహిష్కరిస్తున్నాం. భాజపా నాయకులు చెప్పే మాటలను రైతులు నమ్మొద్దు. కేసీఆర్ సూచనలను రైతులు పాటించాలి.
- నామా నాగేశ్వరరావు, తెరాస లోక్‌సభా పక్ష నేత