
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన అమరావతి రైతులు
భోజనం, బసకు ఆటంకాలు ఎదురైనా సడలని పట్టుదల
చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న అమరావతి రైతుల పాదయాత్ర
ఈనాడు, తిరుపతి: రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. నెల్లూరు జిల్లా సరిహద్దు ముగింపు వద్ద రైతులు మోకరిల్లి సింహపురి వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని జగ్గరాజుపల్లెకు చెందిన రైతులు, మహిళలు జైఅమరావతి నినాదాలతో వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం చింతపాలెం వరకు 16 కి.మీ. వరకు యాత్ర కొనసాగింది. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల తెదేపా అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహయాదవ్, ఎమ్మెల్సీ రాజసింహులు, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్లీ నుంచి వచ్చిన రైతు సంఘం నాయకులు సంజీవ్ చౌదరి, తోమర్ మాట్లాడుతూ... ‘అమరావతే ఏపీ రాజధానంటూ న్యాయస్థానాలు స్పష్టం చేసినా... ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అదే జరిగే ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో ఉన్న సమస్య దేశ సమస్యగా మారే ప్రమాదముంది’ అని హెచ్చరించారు.
భోజన విరామం కోసం ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని వైకాపా నేతలు దున్నేయడంతో రైతులు కిలోమీటరున్నర దూరం లోపలికి ప్రయాణించి అక్కడ భోజనం చేయాల్సి వచ్చింది. పాదయాత్ర ముగిశాక శ్రీకాళహస్తిలోని ఓ కల్యాణ మండపంలో బసకు ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక వైకాపా నేతల ఒత్తిడితో మండపం నిర్వాహకులు వెనక్కి తగ్గారు. దీంతో రైతులు మరో ప్రాంతంలో బస ఏర్పాటు చేసుకున్నారు.
రథాన్ని నడుపుతున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి
శ్రీవారి దర్శన భాగ్యం కల్పించండి
ఈనాడు డిజిటల్, నెల్లూరు: తమకు ఈనెల 15, 16వ తేదీల్లో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని అమరావతి పరిరక్షణ సమితి నేతలు తితిదేని కోరారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వారు మాట్లాడుతూ... ‘పాదయాత్రలో 200 కుటుంబాలు పాల్గొంటున్నాయి. వీరి కుటుంబ సభ్యులు దాదాపు 500 మందికి దర్శన అవకాశం కల్పించాలి. దీనికి రాజకీయాలను ముడిపెట్టొద్దు’ అని తితిదే దేవస్థానం ఛైర్మన్ సుబ్బారెడ్డిని ప్రాధేయపడుతున్నట్లు అమరావతి ఐకాస నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు కోరారు.
పోలీసుల ప్లకార్డుల ప్రదర్శన
పాదయాత్రపై ఆద్యంతం పోలీసుల నిఘా కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ సూచనలు చేస్తూ వారు తయారు చేసిన ప్లకార్డులను సచివాలయ మహిళా పోలీసులు ప్రదర్శించారు. వీటిపై రైతులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో విరమించుకున్నారు.
పల్లంలో అమరావతి రైతుల మహాపాదయాత్రకు పూలతో స్వాగతం