
గ్రేటర్ హైదరాబాద్
రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షం
12 మంది సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతకు డిమాండ్
పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు
దిల్లీ: ప్రతిపక్ష ఎంపీలు 12 మందిపై విధించిన సస్పెన్షన్ రద్దు అంశం మంగళవారం కూడా రాజ్యసభను కుదిపేసింది. విపక్ష సభ్యులు పదే పదే అడ్డుకోవడంతో సభ ఎలాంటి కార్యకలాపాలను చేపట్టలేకపోయింది. సస్పెన్షన్ రద్దుపై చర్చించాలని విపక్షం, విచారం వ్యక్తం చేస్తేనే సభలోకి అనుమతిస్తామని అధికార పక్షం ఎవరికి వారు పట్టుదలతో వ్యవహరించడంతో మొత్తం మూడు సార్లు సభ వాయిదా పడింది. చివరిగా మధ్యాహ్నం 3.12గంటలకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు. మంగళవారం తొలుత ఉదయం 11 గంటల సమయంలో రాజ్యసభ సమావేశమయ్యింది. సభా కార్యకలాపాల జాబితాను సభ్యుల ముందు ఉంచగానే ప్రతిపక్ష ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించారు. జాబితాలోని అంశాలన్నిటినీ పక్కన పెట్టి నిబంధన 267 కింద ఇచ్చిన నోటీసుపై చర్చించాలన్న విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యర్థనను అంగీకరించడంలేదని సభాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించగా సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్.. రెండు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి అనుమతించారు. మంత్రి మన్సుఖ్ మాండవీయ అందుకు ఉద్యుక్తుడవుతుండగానే విపక్ష సభ్యులు నినాదాలు అందుకున్నారు. సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ తిరిగి భేటీ కాగా ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.. సంతాన సాఫల్య సహాయక సాంకేతికతల(నియంత్రణ)బిల్లు-2021, సరోగసీ(నియంత్రణ) బిల్లు-2020లను ప్రవేశపెట్టారు.
వారికి పరిహారం చెల్లించాలి: రాహుల్
సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల తరఫున వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం లోక్సభ జీరో అవర్లో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు.