
గ్రేటర్ హైదరాబాద్
ఆటోమేషన్‌కు తగ్గట్లు సిలబస్ మార్పు
ఐటీ సంబంధ అంశాలతో కొత్త పాఠ్య ప్రణాళిక
విద్యా, పరిశ్రమల నిపుణులతో కమిటీని నియమించిన ఏఐసీటీఈ
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం
గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తుంటే మెకానికల్ ఇంజినీరింగ్‌లో మన విద్యార్థులు ఇంకా స్టీమ్ ఇంజిన్‌తో నడిచే రైళ్ల గురించి చదువుకుంటున్నారు. మన అవసరాలు ఒకటైతే... తరగతి గదిలో చెప్పేదొకటి ఉంటోంది
-2019లో జేఎన్టీయూహెచ్లో సిలబస్‌పై జరిగిన సదస్సులో అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య ఎం.పి.పూనియా ఆవేదన ఇది..
ఒకవైపు పరిశ్రమలు ఆటోమేషన్ వైపు శరవేగంగా మారిపోతుంటే అందుకు తగ్గట్లు మెకానికల్ ఇంజినీరింగ్ సిలబస్ మారడం లేదు. ఫలితంగా కొత్తవారికి కొలువులు దక్కడంలేదు. ఉద్యోగాలు చేస్తున్నవారిని ఇప్పటికాలానికి అనుగుణంగా నైపుణ్యాలు లేవని తొలగిస్తున్నాయి. అందుకే విద్యార్థులు బీటెక్ మెకానికల్ బ్రాంచి అంటే దూరం అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో ఏఐసీటీఈ అప్రమత్తమై మెకానికల్ ఇంజినీరింగ్ సిలబస్‌ను ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని నిర్ణయించింది. ఐఐటీ బాంబే మెకానికల్ బ్రాంచి ఆచార్యుడు బి.రవి ఛైర్మన్‌గా పలువురు నిపుణులతో ఇటీవల కమిటీని నియమించింది.
ఐటీ పరిశ్రమకూ పనికొచ్చేలా..
అన్నిరకాల పరిశ్రమలు యంత్రాలతో పనిచేసేలా ఆటోమేషన్ దిశగా మారిపోతున్నాయి. అలాంటిచోట్ల సిబ్బంది పనిచేయాల్సి వస్తే పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసిన వారు సరిపోతారు. పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాలుంటే అప్పుడు ఇంజినీర్లను నియమించుకుంటాయి. అందుకే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్(క్యాడ్), మెకట్రానిక్స్, 3డీ ప్రింటింగ్, డ్రోన్ల తయారీ, సాంకేతికతతో పాటు సాఫ్ట్వేర్ నైపుణ్యం ఉండేలా ఐటీ సంబంధ అంశాలను అధికంగా మార్చాలన్నది ఏఐసీటీఈ ఆలోచన. మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమల్లోనే కాకుండా ఐటీ పరిశ్రమల్లోనూ బీటెక్ మెకానికల్ ఇంజినీర్లను అధికంగా నియమించుకునేలా సిలబస్‌ను మార్చాలని మండలి భావిస్తోంది. అందుకే ఐఐటీలు, ఐఐఎస్సీ బెంగళూరు ఆచార్యులతో పాటు పరిశ్రమల నిపుణులను కూడా కమిటీలో నియమించింది. వచ్చే విద్యాసంవత్సరం(2022-23) నుంచే కొత్త సిలబస్‌ను అమలు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.
మూడో వంతూ నిండటం లేదు!
దేశవ్యాప్తంగా మెకానికల్ బ్రాంచిలో మూడో వంతు సీట్లు నిండటం గగనంగా మారింది. 2017-18 విద్యాసంవత్సరం దేశవ్యాప్తంగా 3,41,621 మెకానికల్ సీట్లు ఉండగా.. అందులో 1,59,920(46.80 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. నాలుగేళ్ల కిందటే ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు భర్తీ శాతం 35కి పడిపోయి ఉంటుందని నిపుణుల అంచనా. తెలంగాణలో 2018-19లో సీట్లు, 2021-22 విద్యాసంవత్సరంలో సీట్లతో పోల్చుకుంటే దాదాపు 40 శాతం తగ్గిపోయాయి. ప్రవేశాలు పొందినవారు ఈసారి 32.57 శాతం మాత్రమే. అదీ కన్వీనర్ కోటాలో.. యాజమాన్య కోటా సీట్లను కలుపుకొని చూస్తే నాలుగో వంతు కూడా నిండవని స్పష్టమవుతోంది. రాష్ట్రంలోనే కాదు.. ఎన్ఐటీల్లోనూ మెకానికల్ సీట్లు భారీగా మిగిలిపోయాయి. జోసా కౌన్సెలింగ్ తర్వాత ఎన్ఐటీ వరంగల్, ఏపీలో ఒక్కోచోట కూడా 15 సీట్లు భర్తీ కాలేదు. వాటికోసం మరో రెండుసార్లు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ‘అందరూ కంప్యూటర్ సైన్స్ కోరుకుంటుండటంతో జేఎన్టీయూహెచ్ అన్ని బ్రాంచీల్లో మేజర్, మైనర్ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెడుతోంది. బీటెక్ మూడో ఏడాది నుంచి మెకానికల్ విద్యార్థి... కృత్రిమ మేధ, రోబోటిక్స్ తదితర ఆసక్తి ఉన్న కోర్సులను ఎంచుకోవచ్చని’ అని మెకానికల్ ఆచార్యుడు విజయకుమార్‌రెడ్డి చెప్పారు.
- ఈనాడు, హైదరాబాద్