
ఆంధ్రప్రదేశ్
ఎమ్మిగనూరు, న్యూస్టుడే: పాఠశాల భవనాలు పెచ్చులూడి బిడ్డలు ప్రమాదం బారినపడే అవకాశం ఉందంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సోగనూరు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. మంగళవారం వారు తరగతి గదుల నుంచి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. 235 మంది విద్యార్థులు, 9 మంది ఉపాధ్యాయులకు 7 గదులు ఉండగా అన్నీ శిథిలమయ్యాయని, ప్రత్యామ్నాయ గదులు కేటాయించే దాకా పిల్లలను బడికి పంపేది లేదని తీర్మానించారు. సమస్యను ఎంఈవో ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్లగా గదులు శిథిలమైన మాట వాస్తవమేనని, నాడు-నేడు రెండో విడతలోనూ ఎంపిక కాలేదని, చర్యలు చేపట్టేలా ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు.