
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర్రెడ్డి
ఈనాడు, అమరావతి: సీఎం జగన్ వారం రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర్రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దీని అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ప్రస్తుతం ఆ ప్రక్రియ నడుస్తోందని తెలిపారు. పీఆర్సీ అమలు చేశాక డీఏలు ఇవ్వడానికీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉద్యోగ సంఘాలు చెబుతున్న 71 అంశాల్లో పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమస్యలే కీలకమైనవి. మిగతావన్నీ చిన్న అంశాలే. సీపీఎస్ ఉద్యోగులకు పాత పింఛను విధానంలో ఉండే ప్రయోజనాలు వర్తించేలా ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో తెలంగాణలో న్యాయస్థానాల నుంచి అడ్డంకులు వచ్చాయి. ఇక్కడ న్యాయ అవరోధాలు లేకుండా ఆ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని చెప్పారు. వారం, పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పినా ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఈ విషయంలో సంయమనం పాటించాలని కోరారు.